మూతిపుండు వ్యాధి జీవాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ‘పారాపాక్స్ వైరస్’తో ఈ వ్యాధి సోకుతుంది. ఈ సూక్ష్మజీవులు చర్మపు పొక్కుల్లో నివాసం ఉంటాయి. జీవాల పెదవులపైనా, నోటిలో గాయాలైనప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
వ్యాధి లక్షణాలు : వ్యాధికి గురైన జీవాల పెదాలు, ముఖంపైన పొక్కులు కనిపిస్తాయి. వ్యాధి ముదిరేకొద్దీ.. పొక్కులు పెదవులంతా వ్యాపిస్తాయి. ఫలితంగా జీవాలు మేత తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి. నాలుగు నుంచి ఐదు నెలల గొర్రెలు, మేక పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతుంటాయి. పెద్దజీవాల్లో వ్యాధి అంతగా వ్యాపించదు.
చికిత్స : ముందుగా జీవాల నోటిపై ఏర్పడ్డ పుండ్లను పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. పశువైద్యుడిని సంప్రదించి, యాంటీబయోటిక్ మందులను వాడాలి. వ్యాధికి గురైన జీవాలకు తేలికగా అరిగే గంజిని తాగించాలి.