హైదరాబాద్ : ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు.. రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. మట్టిసారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అన్న ఆయన, ఈ విషయంలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన “ప్రకృతిసైన్యం” పుస్తకాన్ని శనివారం హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వెంకయ్య ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన 100 మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడాన్ని అభినందించారు. ఈ పుస్తకంలో చోటు సంపాదించుకున్న రైతులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు.
మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామని, ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చన్నారు. విద్యుత్, నీటి విషయంలో కూడా వాడకాన్ని తగ్గించి, పెట్టుబడిని తగ్గించుకోవచ్చని, పెట్టుబడి తగ్గిందంటే రైతు లాభం పెరిగినట్టేనని చెప్పారు. ప్రస్తుతం సేంద్రీయ పంటలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలోనూ ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయానికి పూర్తిగా అలవాటు పడలేదని, ఒక్కసారిగా పూర్తి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించకుండా క్రమంగా భూమిలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయిస్తూ రావలసిన అవసరం ఉన్నదన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చేందుకు చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రకృతి ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నార్మ్ సంచాలకులు శ్రీనివాస రావు, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.రామచందర్, రైతునేస్తం పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు సహా పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.