
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉన్నది ఒకటే ఎకరం.. దాంట్లో వరి పండిస్తే చిల్లి గవ్వ చేతికి రాదని ఆ రైతన్నకు తెలుసు. ఉన్న భూమిని ఎలా వాడాలి, ఎలా ఆదాయం పొం దాలి అని ఆలోచించి.. ఏకంగా పది రకాల పంటలను వేశాడు. ఆ పది పంటలే ఇప్పుడు అతనికి రోజుకు రూ. వెయ్యి ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ పరిధిలోని విలేజ్ నంబర్-2కు చెందిన బిపిన్ హల్దార్కు ఎకరం భూమి ఉన్నది. ఇందులోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాడు. మామిడితోట పెట్టాడు. అందులో 60 చెట్లు ఉన్నాయి. అంతర పంటలుగా గోబీ, వంకాయ, చిక్కుడు, మిరప, టమాట, పాలకూర, మొంతి, కొత్తిమీర పండిస్తున్నాడు. అక్కడక్కడా బొప్పాయి కూడా పెంచుతున్నాడు. అంతేకాదండోయ్.. ఆ భూమిలోనే రెండు గుంటల్లో చెరువును తవ్వించి, చేపల పెంపకం చేపట్టాడు. నిండా నీళ్లున్న బోరు, 24 గంటల ఉచిత కరెంటుతో పంటలు సాగు చేస్తున్నా డు. కూరగాయలను స్థానికంగా, మార్కెట్లో అమ్మి రోజుకు రూ.500 నుంచి రూ.600 సంపాదిస్తున్నాడు. చేపల చెరువులో గత జూలైలో 2 వేల చేప పిల్లలను వేసి పెంచాడు. అవి చేతికి వస్తున్నాయి. వీటిని అమ్మితే నిత్యం రూ. 500 వరకు వస్తున్నాయి. రోజుకు రూ. వెయ్యి దాకా ఆదాయాన్ని పొందుతున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
హల్దార్ ఎకరం భూమిలో పంటలు ఇవీ..
మామిడి తోట (60 చెట్లు), గోబీ, వంకాయ, చిక్కుడు, మిరప, టమాట, పాలకూర, మెంతి, కొత్తిమీర, బొప్పాయి. ఇవి కాక రెండు గుంటల్లో చేపల చెరువు ఉన్నది.

చేతి నిండా డబ్బు ఉంటది
నాకు ఎకరం భూమి ఉంది. నాలుగేండ్ల కిం దట మామిడి మొక్కలు పెట్టిన. అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న. రెండు గుంటల్లో చెరువును తవ్వి అందులో చేపలు పెంచుతున్న. రోజుకు ఐదారు కిలోల చేపలు అమ్ముతా. రోజూ మూడు, నాలుగు రకాల కూరగాయలను మార్కెట్కు తీసుకపోత. నెలా రూ.30 వేల దాకా వస్తయి. రూ.5 వేలు ఖర్చులకు పోయినా రూ.25 వేలు మిగులుతయి. వరికి బదులు కూరగాయల సాగు, చేపల పెంపకాన్ని చేపట్టడంతో ప్రతి రోజు చేతినిండా డబ్బు ఉంటున్నది.