Emu bird farming | ఈము పక్షులను పెరట్లోగానీ, ఫారమ్‌లు ఏర్పాటు చేసిగానీ పెంచి మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈము మాంసం, నూనె, చర్మం చాలా విలువైనదిగా చెప్తుంటారు. ఈము పక్షులు అన్ని శీతోష్ణస్థితులను తట్టుకుని, రేంజి పద్ధతిలో గానీ, పరిమితమైన స్థలంలోగానా పెంచుకునేందుకు అనువైనవి. వీటి జీవితకాలం 25-30 సంవత్సారాలు. ఆడపక్షి మగపక్షి కంటే పెద్దది. సంతానోత్పత్తి సమయంలో మగపక్షి చురుగ్గా ఉన్నా కూడా.. ఆడ పక్షి ఎక్కువ అధికారికంగా ఉంటుంది.
ఈము పక్షులు దాదాపు 6 అడుగుల ఎత్తు, 45-60 కిలోల బరువు కలిగి ఏడాదికి కనీసం 20 గుడ్ల చొప్పున 20-25 సంవత్సరాలు పెడతాయి. వీటి ఈకలు, ముక్కు రంధ్రాలు వాతావరణ మార్పులకు తోడ్పడేలా ఉంటాయి. ఆకులు, కీటకాలు, దుంపలు, లేతగడ్డి, పండ్లను తిని జీవిస్తాయి. ఈ పక్షులను అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు.
గుడ్లు పొదగడం..
గది ఉష్ణోగ్రతకు అలవాటైన తర్వాత గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ట్రేలో వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. గుడ్లను ఉంచిన ట్రేను జాగ్రత్తగా పొదిగే ప్రాంతంలో ఉంచాలి. ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని గురించి తెలిపే చీటిని అందులో పెట్టాలి.
పిల్లల పెంపకం..
ఇన్ క్యూబేటర్లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి 20 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్‌ను ఉపయోగించి క్రిములను నాశనం చేయాలి. ప్రతి గంటకు ఒకసారి గుడ్లను తిప్పుతూ 48వ రోజు వచ్చే దాకా అలాగే చేస్తూ ఉండాలి. 49 వ రోజు తర్వాత గుడ్లను తిప్పడం మాని కదలికల కోసం గమనించాలి. 52 వ రోజుకు పొదిగే సమయం పూర్తవుతుంది. ఈమూ పక్షి పిల్లలు పొడిగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల నుంచి పిల్లలు బయటికి వచ్చినప్పుడు కనీసం 24 నుంచి 72 గంటల దాకా పొదిగిన గదిలోనే ఉంచాలి. సంతానోత్పత్తి దశలో సక్రమమైన పోషకాహారం అందించడం వలన ఆరోగ్యకరమైన పిల్లలు పొందడానికి కారణమవుతుంది.
దాణా మిశ్రమం ఇలా..
ఈము పక్షుల దాణాలో జీర్ణంకాగల మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండాలి. లవణ మిశ్రమం, విటమిన్లు తగిన పాళ్లలో దాణాలో కలపాలి. దాణా దినుసుల తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉండకుండా తాజాగా తయారుచేసుకోవాలి. దాణాలో బూజు పట్టకుండా, దాణా వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
వ్యాపించే జబ్బులు..
ఈము పక్షుల పిల్లలకు సంక్రమించే జబ్బుల్లో సూక్ష్మజీవుల ద్వారా సంక్రమించే క్లాస్ట్రీడియం, కొక్కొర వ్యాధి, ఆస్పర్జిల్లోసిస్ వ్యాధులు ముఖ్యమైనవి. పరసరాలను పరిశుభ్రంగా ఉంచి శానిటైజర్ వాడటం, దాణాలో తగిన సూక్ష్మ పోషకాలు ఉండేలా చూడటం ద్వారా జబ్బులను అరికట్టవచ్చు. ఈము కోళ్లను మిగతా కోళ్లతో కలువకుండా చూడటం వలన ఆన్ఫ్లూయెంజా వ్యాపించకుండా చూసుకోవచ్చు. కాళ్లు చాపడం, రికెట్స్ వంటి వ్యాధుల వల్ల చనిపోతుంటాయి. అప్పటికప్పుడు యాంటిబయోటిక్స్ మందులను ఎలక్ట్రాల్ ద్రావణం ద్వారా అందించాలి. బ్రీడింగ్ సమయంలో పిల్లలు కొట్టుకుని కాళ్లు విరగొట్టుకుంటాయి. అలాంటి వాటిని గుర్తించి వేరుగా ఉంచాలి.
చేయదగినవి..
(కొట్టంలో ఎప్పుడూ ఎక్కువ పక్షులను ఉంచకూడదు.
శుభ్రమైన నీరు, ఒత్తిడిని తగ్గించే పదార్థాలను అందించాలి.
నీటిని నిత్రం శుభ్రంగా ఇవ్వాలి.
త్రాగే నీరు, దాణాను పర్యవేక్షిస్తూ దిద్దుబాట్లు ఏవైనా ఉంటే చేయాలి.
ఖనిజ లవణాలు, విటమిన్లు మేతలో తగినంత ఉండేలా చూడాలి.
all-in and all-out పెంపక విధానం పాటించడం మేలు.
చేయకూడనివి..
పక్షులను ఎప్పడూ వేడిగా ఉన్న సమయాల్లో తిప్పకూడదు.
కొట్టంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి.
మేకులు, గులకరాళ్ళు పక్షులకు చేరువలో ఉండకుండా జాగ్రత్తపడాలి.
తెలియని వ్యక్తులను, పదార్థాలను పెంపక కేంద్రంలోనికి అనుమతించకూడదు. .
వరి ఊక పరచిన స్థలంలో పక్షి పిల్లలను ఉంచరాదు.