సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల రైతులు.. పొప్పడి సాగుపై దృష్టి పెట్టారు. మార్కెట్లో ఈ పండ్లకు గిరాకీ ఉండటంతో.. మండలంలోని చిన్నమాసన్పల్లి, లింగారెడ్డిపల్లి, ఎల్కల్, బేగంపేట, రామారం తదితర గ్రామాల్లోని రైతులు 45 ఎకరాల్లో పొప్పడి తోటలను పెంచుతున్నారు. ఈ ప్రాంతం పండ్ల తోటలకు అనువైనది కావడం, తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉండటంతో.. రైతులు కూరగాయలతోపాటు పండ్ల తోటలనూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నమాసాన్పల్లిలో పలువురు రైతులు డ్రిప్ విధానంలో పొప్పడిని పండిస్తున్నారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. ఆరు నెలల నుంచే పంట దిగుబడి ప్రారంభం అవుతుండగా, ఎకరానికి రూ.50 వేల పెట్టుబడితో రూ.2 లక్షల ఆదాయం పొందుతున్నారు.
సాగు విధానం
పొప్పడి తోటల పెంపకానికి మెట్ట నేలలు అనుకూలం. డ్రిప్ విధానంలో పైపులను అమర్చుకోవాలి. ప్రతి ఆరు అడుగులకు ఒక అడుగు లోతు గుంత తవ్వి, అందులో ముందుగా సిద్ధ్దం చేసుకున్న సేంద్రియ ఎరువులను వేసుకోవాలి. దీనిని వారం, పదిరోజులపాటు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలను నాటుకోవాలి. మూడు రోజుల తర్వాత మొక్కలకు నీరు పోయాలి. ఆ తర్వాత నాలుగు రోజులకోసారి మొక్కలను నీటితో తడిపితే సరిపోతుంది. పిందె దశలో ఉన్నప్పుడు రోజు తప్పించి రోజు నీరు పోస్తే ఆరు నెలల్లో పొప్పడి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఈ మొక్కలను ఒక్కసారి నాటుకుంటే.. ఏడాదిపాటు దిగుబడిని ఇస్తాయి. పది రోజులకు ఒకసారి పండ్లను తెంపి మార్కెట్కు తరలించవచ్చు. మార్కెట్లో పెద్ద సైజులో ఉన్న పొప్పడికి మంచి ధర ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పొప్పడి తోటల పెంపకంలో రైతులు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూమిని 30 నుంచి 40 సెం.మీ. లోతు వరకు దున్నాలి. మొక్కల మధ్య 1.8 మీ. దూరం ఉండేలా గుంతలు తీయాలి. మొక్క నాటే 15 రోజుల ముందు ఐదు కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి, ఇరవై గ్రాముల అజోస్సిరిల్లం వేసి బాగా కలిపి గుంతల్లో నింపుకోవాలి. తేలికపాటి నేలలైతే బోరాన్ ధాతువు లోపం ఎక్కువ కనిపిస్తుంది. దీని నివారణకు లీటర్ నీటిలో 1గ్రా. బోరాక్స్, 2గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. మొక్కల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిలిస్తే పంటకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. తోటలో ఈ సమస్య కనిపిస్తే.. నివారణ కోసం లీటర్ నీటిలో 2.5 గ్రా. మాంకోజెట్ కలిపి, పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఉద్యానశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ, ప్రతి 15 రోజులకు ఒకసారి సరైన మందులను పిచికారీ చేసుకోవాలి. పూతకు వచ్చే దాకా క్రిమికీటకాల నుంచి చెట్లను కాపాడుకోవాలి.
వరితో లాభం లేదు..
ఇప్పుడు వరితో లాభం ఎక్కువగా ఉండటం లేదు. అందుకే కూరగాయలు, పండ్ల తోటల సాగుపైనే దృష్టి పెడుతున్నం. పొప్పడి తోటలను సాగు చేస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు. నాకు ఎకరానికి రూ.50 వేల పెట్టుబడితో, రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. n పాకాల భిక్షపతి, రైతు.
మంచి లాభాలు..
ఎకరం భూమిలో పొప్పడి సాగు చేస్తున్నా. డ్రిప్ సాయంతో నీరు అందిస్తున్నా. ప్రతి మొక్కకూ నీరు అందుతుండటంతో మొక్కలు ఏపుగా పెరిగాయి. దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది. కరోనా ఉన్నప్పుడు మార్కెట్లో మంచి ధర పలికింది.
– రైతు ఐలయ్య
…?గల్వ మహేందర్ రెడ్డి