తాండూర్ : యువత పోలీసులతో భాగస్వామ్యం కావాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( CP Amber Kishore Jha ) అన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు సంబంధించి రిసెప్ష్సన్ కానిస్టేబుల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్సై, సిబ్బందికి సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసే విభాగం పోలీస్ విభాగం ఒక్కటేనని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కమ్యూనిటీ పోలీస్‌లో భాగంగా యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఆనంతరం సీపీ మాట్లాడారు.
నేటితరం యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాలను విడనాడాలని కోరారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఎ బాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సీఐ దేవయ్య, తాండూర్, మాచారం ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య, సిబ్బంది ఉన్నారు.