మంచిర్యాల, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరానికి గాను లాభాల లెక్కలు ఎప్పుడు తేలుతాయంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ప్రకటన వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగియగానే లాభాలను ప్రకటించాలి. యేటా ఆలస్యం చేస్తుండడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాభాలు ఎప్పుడు ప్రకటిస్తారు. మా వాటా ఎప్పుడు తేలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 16 శాతం ఉన్న కార్మికుల లాభాల వాటాను కేసీఆర్ 32 శాతం వరకు పెంచారు.
ఈసారి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2023-24 లో సింగరేణి సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకుని, 69.1 శాతం లక్ష్యం సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గుకు డిమాండ్ పెరగడంతోపాటు, బొగ్గు రవాణా గతంతో పోలిస్తే అధికంగా జరిగింది. దీంతో లాభాలు గతేడాదికంటే ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని కార్మికులు భావిస్తున్నారు. సంస్థకు లాభాలు పెరిగిన నేపథ్యంలో కార్మికులకు ఇచ్చే లాభాల వాటా కూడా పెంచాలని పట్టుబడుతున్నారు.
అనవాయితీకి బ్రేక్
యేటా ఉగాదికి సింగరేణి సంస్థ చైర్మన్ లాభాలపై ప్రకటన చేయడం ఒక ఆనవాయితీ. ఈ ఏడాది సంస్థ పెట్టకున్న టార్గెట్, చేరుకున్న లక్ష్యం, వచ్చిన లాభం ఎంత అన్నది ప్రకటించి, లాభాల్లో కార్మికుల వాటాను త్వరలో చెల్తిసామంటూ చెప్పేవారు. కానీ ఈ ఏడాది అలాంటి ప్రకటన ఏం రాలేదని సింగరేణి కార్మికులు అంటున్నారు. కోలిండియా వ్యాప్తంగా ప్రతి సంస్థ మూడు నెలలకు ఒకసారి ఆర్థిక లావాదేవీలపై ప్రకటన చేయాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే కోల్ ఇండియా లాభాల వివరాలను వెల్లడించింది. సింగరేణి సంస్థ మాత్రం ఇప్పటి వరకు వివరాలు ఇవ్వలేదు.
మహారత్న, నవరత్న వంటి కంపెనీలు ఆర్థిక సంవత్సర లావాదేవీలను ప్రకటించాయి. సింగరేణి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లావాదేవీలపై ప్రకటన అనంతరం వచ్చిన లాభాల్లో నుంచి డీఎంఎఫ్టీ, ఎస్ఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు డీఎంఎఫ్టీ, ఎస్ఎంఎఫ్టీ కింద ఎలాంటి నిధులు ఖర్చు చేయలేదు. కారణం లాభాల వివరాలు వెల్లడించకపోవడం అని సింగరేణి కార్మికులు చెప్తున్నారు. కాకపోతే యేటా సీఎస్ఆర్ నిధుల కింద ఇచ్చే రెండు శాతం ఈ ఏడాది కూడా ఇచ్చారు. పలుచోట్ల పనులు చేస్తున్నారు. లాభాల లెక్క తేల్చకుండా ఇది ఎలా చేస్తున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సింగరేణి లాభాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
33 శాతం అని.. 16.90 శాతమే ఇచ్చిన కాంగ్రెస్..
సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల్లో నుంచి కార్మికులకు వాటా ఇవ్వాలి. గతేడాది కాంగ్రెస్ సర్కార్ 33 శాతం వాటా ఇస్తామని ప్రకటించినా, చివరికి ఇచ్చింది 16.90 శాతమేనని కార్మికులు అంటున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.2,283 కోట్లు సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన పెట్టి, మిగిలిన రూ.2,414 కోట్లలోనే 33 శాతం వాటా రూ.796 కోట్ల కార్మికులకు ఇస్తున్నట్లు మెలిక పెట్టారు.
దీంతో లాభాల్లో వాటా రూ.4,701 కోట్లలో 33 శాతం రూ.1,550 కోట్లు రావాల్సింది. కేవలం 16.90 శాతంతో సరిపెట్టారు. గతంలో కేసీఆర్ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చిందని, కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని సగం పక్కన పెట్టి మిగిలిన సగానికి వాటా ఇచ్చిందని కార్మికులు మండిపడుతున్నారు. ఈసారి అలా కాకుండా సింగరేణి సంస్థకు వచ్చే నికర లాభంలో వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నికర లాభంలో 35 శాతం వాటా ఇవ్వాలి
ఆలస్యం చేయకుండా సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలి. మొత్తం నికర లాభంలో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి. ఆనవాయితీ ప్రకారం లాభాలపై ప్రకటన చేయకుండా చోద్యం చూస్తుండడం సరికాదు. లాభాల వాటా ప్రకటించాక డీఎంఎఫ్టీ, సీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా సీఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు వాస్తవ లాభాలు వెంటనే ప్రకటించి, కార్మికులకు న్యాయం చేయాలి. – పొగాకు రమేశ్, టీబీజీకేఎస్, సెంటర్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ.