చెన్నూర్ రూరల్/చెన్నూర్ జూన్ 16: చెన్నూర్ మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తుర్కపల్లిలో వృద్ధురాలు మీసాల మల్లక్క రేకుల ఇంటి పైకప్పు కొట్టుక పోయింది. మల్లక్క తలపై రేకులు పడడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి వెంటనే చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ భాస్కర్ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చెన్నూర్ పట్టణంలో మోస్తారు వర్షం కురిసింది.
వేమనపల్లి, జూన్ 16 : వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామ శివారులో గొర్రెల మందపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 14 గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని కన్నెపల్లి మండలం మొక్కంపల్లికి చెందిన బాధితులు మేకల రాజయ్య, హేమంత్ తెలిపారు. అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరారు. వేమనపల్లి మండలంలోని జిల్లెడ, సూరారం, బుయ్యారంలో వర్షం కురిసింది.
భీమారం, జూన్ 16 : భీమారంతో పాటు పోలంపల్లి, భీమారం, ఆరెపల్లి, దాంపూర్, ఖాజీపల్లి, కొత్తపల్లి, మద్దికల్, ధర్మారం గ్రామాల్లో వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
జై నూర్ : జైనూర్ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.