చెన్నూర్ టౌన్, మార్చి 25 : చెన్నూర్ ప్రాంతంలోని టాసర్ పట్టు రైతులకు ప్రోత్సాహం అందిస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూర్‌లో ఉద్యానవన-పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రాంచీలోని సీఎస్బీ-సీటీఆర్టీఐ సహకారంతో ఏర్పాటు చేసిన టాసర్ రేషం(పట్టు) కృషి మేళాను కలెక్టర్ ప్రారంభించారు.
దసలిపట్టు గూళ్ల నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించారు. అనంతరం మోడల్ కొకూన్ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జార్ఖండ్‌లోని రాంచీలో గల సీటీఆర్ అండ్టీఐ సంచాలకుడు డా.ఎన్.బాలాజీ చౌదరి, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో గల బీటీఎస్వో సంచాలకుడు డా.సెల్వకుమార్, జిల్లా ఉద్యానవన- పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు ఎం.లత, వరంగల్ జిల్లా సంయుక్త సంచాలకురాలు జీ.అనసూయతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కోసం రూ.40 లక్షల అంచనా వ్యయంతో డీఎంఎఫ్టీ నిధుల కింద పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో గిడ్డంగిని ప్రారంభించినట్లు తెలిపారు. టాసర్ పట్టు కృషి మేళా కార్యక్రమాన్ని రైతుల కోసం నిర్వహించినట్లు పేర్కొన్నారు. టాసర్ పట్టు ఉత్పత్తి చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు. పట్టు వస్ర్తాల తయారీ, ఫ్యాబ్రిక్స్ తయారీ అభివృద్ధి చేయాలని, దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు.
టాసర్ హోస్ట్ ప్లాంటేషన్ కోసం పోడు, అటవీ భూములను ఉపయోగించుకోవాలని సూచించారు. దేశంలో టాసర్ ముడి పట్టు ఉత్పత్తిలో దశాబ్ద కాలంగా సైంటిస్ట్ డీ.ఎంవీకే భగవానులు నేతృత్వంలోని బీఎస్ఎంటీసీ చెన్నూర్ అత్యుత్తమ సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం టాసర్ సిల్క్ రీలింగ్ యంత్రాల పనితీరును పరిశీలించారు.
చెన్నూర్ ప్రాంతంలో అత్యుత్తమ, నాణ్యమైన టాసర్ పట్టు ఉత్పత్తి చేయడంపై రాంచీలోని సీటీఆర్టీఐ, సీఎఐస్బీ సంచాలకుడు అభినందించారు. అనంతరం పట్టు గూళ్ల ఉత్పత్తి, టాసర్ గుడ్ల ఉత్పత్తిలో ఉత్తమ రైతులతో పాటు అధికారులు, విరమణ పొందనున్న సెంట్రల్ సిల్క్ బోర్డు చెన్నూర్ ఎంవీకే భగవానులును కలెక్టర్, సంచాలకులు సత్కరించారు. ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో సెరీకల్చర్ ఏడీ రాథోడ్ పార్వతి, ములుగు ఆర్ఎస్ఆర్ఎస్ డా.జీ రాఘవేంద్ర, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.