చెన్నూర్ : కాంగ్రెస్ ( Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అటు ప్రజల నుంచి ఇటు పార్టీకి చెందిన సొంత నాయకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ ( Chennur ) మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముత్యాల రవికుమార్ గౌడ్ ( Ravikumar Goud ) జిల్లాకు చెందిన మంత్రి వివేక్, పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణపై విరుచుకుపడ్డ వీడియో సంచలనం రేపుతుంది.
శుక్రవారం ఆయన చెన్నూర్ పట్టణంలో కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని, పార్లమెంటు ఎన్నికల్లో అతని కుమారుడు వంశీకృష్ణను ఓడించి బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను గెలిపించుకుంటామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తండ్రి, కొడుకులు వివేక్ వెంకటస్వామి , వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు మనశాంతిగా లేరన్నారు. లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పోలీసు స్టేషన్లో సిబ్బంది బహిరంగంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల భూములకు, ప్రభుత్వ భూములకు రక్షణ లేదని ఆరోపించారు. బాల్క సుమన్ ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరినీ మోసం చేసిన చరిత్ర వివేక్‌కు దక్కుతుందని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోతే, తాను సొంతగా నియోజకవర్గంలో ప్యాక్టరీని ఏర్పాటు చేసి 42 వేల ఉద్యోగాలు ఇక్కడి యువకులను కల్పిస్తామని చెప్పిన మాటలు నిజం కాదా ? అంటూ గుర్తు చేశారు. చెన్నూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేపట్టిన ఇంటిగ్రేటేడ్ కూరగాయల మార్కెట్, బస్ డిపో నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయటం లేదని తెలిపారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని 25 సంవత్సరాలు వెనుకకు నెట్టేశారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ కండువా వేసుకునే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.