మంచిర్యాల, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న సన్న రేషన్ బియ్యం పంపిణీలో అప్పుడే అక్రమాలు మొదలయ్యాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో మొదటి రోజే రేషన్ షాపులకు వచ్చిన బియ్యం తూకాల్లో తేడాలున్న విషయం తెలిసింది. పౌరసరఫరాల శాఖలోని కొందరు దొంగలు పందికొక్కుల్లా మారి సర్కారు సరఫరా చేస్తున్న బియ్యాన్ని బుక్కేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. సన్నబియ్యం అనే కాదు గతంలో దొడ్డు బియ్యం పంపిణీ సమయంలోనూ సదరు అధికారులు ప్రతి నెలా లక్షలాది రూపాయల విలువైన బియ్యం స్వాహా చేసినట్లు తెలిసింది. అసలు ఈ తూకంలో తేడాలకు కారణం ఏమిటి.. తప్పు చేస్తున్న అధికారులు ఎవరు.. ఆ వివరాలు.. వాటికి సంబంధించిన ఆధారాలు ఇలా ఉన్నాయి.
రేషన్ షాపులకు వెళ్లే బస్తాలు తక్కువ తూకంతో పం పించడంతో నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్ష లు ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, కాంట్రాక్టర్లకు మిగులుతున్నాయి. ఒక్కో రేషన్ షాప్‌నకు ప్రతి నెలా రెండు క్వింటాళ్ల నుంచి మూడు క్వింటాళ్ల బి య్యం కోత పెడుతారు. ఇలా మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోని 142షాపులకు రెండు క్వింటాళ్ల చొప్పున వేసుకుంటే 284 క్వింటాళ్లు అవుతుంది. క్వింటాలుకు సర్కారు ధర చొప్పున రూ.3000 వేసుకుంటే రూ.8లక్షలు అవుతుంది. ఇలా మొదటి 50 శాతం బియ్యం కోటాలో 284 క్వింటాళ్లు, రెండో 50 శాతం బియ్యం కోటాలో 284 క్వింటాళ్లకు లెక్కవేస్తే దాదాపు రూ.16 లక్షలు అవుతుంది. అంటే ఒక్క మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లోనే ప్రతి నెలా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అవుతుంది.
దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పటి నుంచి ఇదే తరహాలో మోసం జరుగుతున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈ లెక్కనే ఇప్పటి వరకు కోట్ల రూపాయాల స్కామ్ జరిగినట్లు తెలుస్తున్నది. ప్రతి నెలా వచ్చే మొత్తంలో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి సహా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల దాకా వాటాలు వెళ్తాయని చెబుతున్నారు. లేకపోతే ఇంత పెద్ద స్కామ్ ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా అటు కాంట్రాక్టర్‌కు లక్షల రూపాయల అదనపు బిల్లులు వస్తాయని, ఇటు అధికారులకు చేబులు నిండుతాయని అందుకే చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం తూకంలో తేడాలు రావడానికి అసలు కారణం ఎంఎల్ఎస్ పాయింట్లలో స్టేజ్-1 కాంట్రాక్టర్ నుంచి వచ్చిన బియ్యాన్ని తూకం వేయకపోవడమే అని నిగ్గుతేలింది. మొన్న కురిసిన వర్షానికి రేషన్ బియ్యం తడిసిందని, మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్లో ఆ బియ్యాన్ని ఆరబోశారనే సమాచారం మేరకు శనివారం ఉద యం ‘నమస్తే తెలంగాణ’ ఎంఎల్ఎస్ పాయింట్‌ను సందర్శించింది. బియ్యం ఎందుకు తడిసినట్లు అని ఆరా తీయగా.. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి బియ్యం తడిసినట్లు చెప్పారు. స్టేజ్-1 కాంట్రాక్టర్ లారీలో బియ్యాన్ని పాయింట్‌కు తీసుకువచ్చారని.. దాన్ని గోదాంలో లోడ్ చేస్తున్న క్రమంలో వర్షం పడిందనన్నారు. అప్పటికీ సగం బస్తా లు దించగా లారీలోనే ఉన్న మిగిలిన సగం బస్తాలు తడిసినట్లు వివరించారు.
అలా ఎన్ని బస్తాలు తడిసినయని అడుగగా, 20 బస్తాల నుంచి 30 బస్తాలు తడిసినట్లు ఎంఎల్ఎస్ పా యింట్ ఇన్చార్జి శంకర్ తెలిపారు. కానీ, అక్కడ ఆరబోసిన ఖాళీ బస్తాలను లెక్కవేయగా అవి దాదాపు 50కి పైచిలుకు ఉన్నాయి. అవి కాకుండా మరో 50 తడిసిపోయిన బస్తాలు ఓపెన్ చేయకుండానే బియ్యంతో సహా ఆరబెట్టి ఉన్నాయి. అదేంటి సార్ ఎక్కువ బస్తాలు కనిపిస్తున్నాయంటే ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే స్టేజ్-1 కాంట్రాక్టర్‌కు చెందిన ఓ లారీ ఎంఎల్ఎస్ పాయింట్‌కు వచ్చింది. నిబంధనల ప్రకారం ఆ లారీలోని బియ్యం బస్తాలను ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంలో దించాలి.
అలా దించుకున్న బియ్యాన్ని రే షన్ షాపులకు సరఫరా చేసే ముందే రేషన్ డీలర్ వచ్చి వేలిముద్ర వేశాక ఆయనకు ఎంత బియ్యం ఇవ్వాలో అంత తూకం వేసి పంపించాలి. కానీ స్టేజ్-1 కాంట్రాక్టర్ నుంచి వచ్చిన ఆ లారీ లోడ్ చాలా సమయం వరకు దించలేదు. కాసేపు అయ్యాక అక్కడికి స్టేజ్-2 కాంట్రాక్టర్(రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసే) లారీ వచ్చింది. వెంటనే స్టేజ్-1 లారీ ఎక్కిన హమాలీలు అందులోని బియ్యం బస్తాలను తీసుకువచ్చి స్టేజ్-2 లారీలో లోడ్ చేస్తూ కనిపించారు. అదేంటి స్టేజ్-1 కాంట్రాక్టర్ లారీలో వచ్చిన బస్తాలను తూకం వేయకుండానే రేషన్ షాపులకు నేరుగా ఎలా సరఫరా చేస్తున్నారని ప్రశ్నించగా, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి అధికారి సహా అక్కడున్న హమాలీలు నీళ్లు నమిలారు. ఫొటోలు తీయగానే బస్తాలను లోడ్ చేయడం నిలిపివేశారు. కాసేపు ఆలోచించుకొని బయట తూకం వేసి రేషన్ షాపులకు తీసుకెళ్తామంటూ చెప్పుకొచ్చారు.
ఎంఎల్ఎస్ పాయింట్లో వర్షానికి రేషన్ బియ్యం తడిసిన విషయంపై ఇప్పటి దాకా ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి స్వయంగా చెబుతున్నారు. ఎందుకు సమాచారం ఇవ్వలేదంటే.. లారీలో నుంచి దించాక బియ్యం తడిశాయని, అప్పటికే లారీ వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ముందేమో లారీలో ఉండగానే తడిశాయి అన్నారు.. ఈ వ్యవహారం అంతా జరిగాక లారీలో నుంచి దించాక తడిశాయంటూ మాటా మార్చారు. వాస్తవానికి బియ్యం స్టేజ్-1 కాంట్రాక్టర్ లారీలో నుంచి స్టేజ్-2 కాంట్రాక్టర్ లారీలోనే నేరుగా లోడ్ చేస్తున్న క్రమంలో వర్షానికి తడిసినట్లు తెలిసింది.
అదే స్టేజ్-1 కాంట్రాక్టర్ లారీ రాగానే ఎంఎల్ఎస్ పాయింట్లో దించుకొని ఉంటే తడిసేవి కాదు. ఇక్కడ అధికారి నిర్లక్ష్యం ఉండడంతో గట్టుచప్పుడు కాకుండా ఆ తడిసిన దాదాపు 50 క్వింటాళ్ల బియ్యాన్ని ఆరబోశారు. రెండు రోజుల్లో వాటిని తిరిగి బస్తాల్లోకి ఎక్కించి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆరబోసిన బియ్యాన్ని పట్టుకుంటే ముక్కలైపోయి నూకలుగా మారుతున్నాయి. అలాంటి బయ్యాన్ని తిరిగి సరఫరా చేసేందుకు సిద్ధమవడం, బియ్యం తడిసిన విషయం ఉన్నతాధికారులకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
స్టేజ్-1 కాంట్రాక్టర్ లారీలో నుంచి వచ్చిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లో తూకం వేయకుండానే స్టేట్ కాంట్రాక్టర్ లారీలోకి ఎక్కించి రేషన్ షాపులకు పంపించే వ్యవహారంపై ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి శంకర్‌ను వివరణ కోరగా.. ఎంఎల్ఎస్ పాయింట్లో పెద్ద కాంట లేదన్నారు. అందుకే బయట వే-బ్రిడ్జిలో తూకం వేసి పంపిస్తున్నట్లు చెప్పారు. మరి అలా వే-బిడ్జ్రిలో తూకం వేసిన రిసీప్ట్‌లు చూపించమని అడుగగా, వాట్సాప్ చేస్తానని చెప్పారు. సరే ధాన్యం తడిసిన విషయం ఉన్నతాధికారులు చెప్పారా అంటే చెప్పలేదు అన్నారు. ఎందుకు చెప్పలేదంటే.. ధాన్యం లారీలో నుంచి దించుకున్నాక తడిసిందని అందుకే చెప్పలేదని చెబుతున్నారు.
ఇదే విషయంపై ముందేమో లారీలో ఉండగానే వర్షానికి ధాన్యం తడిసిందని చెప్పిన అధికారి.. ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటే లారీలో నుంచి దించాక తడిశాయంటూ చెప్పడం గమనార్హం. ఎంఎల్ఎస్ పాయింట్లో రెండు రోజులుగా ఇంత తతంగం నడుస్తున్నా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఉండడం అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికైనా అక్రమాలు పాల్పడుతున్న అధికారులు, తక్కువ బరువుతో బియ్యం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా లేకపోతే మాముళ్ల వ్యవహారం బయట పడుతుందని మిన్నకుండిపోతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం ఎంఎల్ఎస్ పాయింట్లో తూకం వేశాకే రేషన్ షాపులకు ఆ బియ్యాన్ని సరఫరా చేయాలి. కానీ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌కు స్టేజ్-1 కాంట్రాక్టర్ సరఫరా చేసిన బియ్యాన్ని తూకం వేయకుండా స్టేజ్-2 కాంట్రాక్టర్ ద్వారా నేరుగా రేషన్ షాపులకు సరాఫరా చేస్తున్నారు. అలా పంపిన బియ్యం బస్తాల తూకాల్లో తేడాలు ఉంటున్నాయి. లెక్కప్రకారం గన్నీ సంచి బరువు 500 గ్రాములు అనుకుంటే రేషన్ షాపులకు వచ్చే ప్రతి బస్తా 50 కిలోల 500 గ్రామాలు ఉండాలి. కానీ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్‌షాపులకు సరఫరా చేసిన బియ్యం బస్తాలు 44కిలోల నుంచి 50 కిలోల లోపు ఉంటున్నాయి. ఈ మేరకు రేషన్ డీలర్లను ఆరా తీయగా ఒక్కో రేషన్ షాపునకు రెండు క్వింటాళ్ల నుంచి మూడు క్వింటాళ్ల తక్కువ బియ్యం వచ్చినట్లు చెప్పారు. మరి ఈ విషయాన్ని డీలైర్లెనా అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదంటే.. మేము మాట్లాడితే కేసులు పెట్టిస్తారని, స్టాక్ రిజిస్ట్రార్లు అడుగుతారని.. షాపులు శుభ్రంగా లేవని బెదిరిస్తారని.. ఆ వేధింపులు తట్టుకోలేక మిన్నకుండిపోతామని చెబుతున్నారు.