జిల్లా సరిహద్దులోని వాంకిడి చెక్‌పోస్టు అక్రమాలకు అడ్డాగా మారింది. స్వయంగా రవాణాశాఖ అధికారులే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్న ట్లు తెలుస్తున్నది. పచ్చనోటు చేతిలో పడితే చాలు నిబంధనలు పాటించని వాహనాలకు రైట్.. రైట్.. చేప్పేస్తున్నారన్న విమర్శలుండగా, బుధవారం అర్ధరాత్రి ఏసీబీ దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని రూ. 45,100లు స్వాధీనం చేసుకోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్-మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి రవాణాశాఖ చెక్‌పోస్టు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం జిల్లా మీదుగా మహారాష్ట్రకు జాతీయ రహదారిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వాహనాల పత్రాలతో పాటు ఓవర్లోడింగ్కు సంబంధించిన పత్రాలను ఆర్టీవో అధికారులు పరిశీలించి, నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తుంటారు.
అయితే, ఇక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణాశాఖ అధికారులే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని మరీ వాహనదారుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. వాహనాన్ని బట్టి రూ. 500 రూ.1000 దాకా.. వీలైతే అంతకుమంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిత్యం రూ. లక్షల్లో ఆదాయముండడంతో రవాణాశాఖ సిబ్బంది పోటీపడి మరీ డ్యూటీలు వేయించుకుంటున్నట్లు సమాచారం. ప్రైవేట్ వక్తులను కూడా షిఫ్టుల వారీగా నియమించుకోవడం విశేషం. అడిగినన్ని డబ్బులిస్తే సరి.. పత్రాలు సరిగా లేకపోయినా.. ఓవర్‌లోడ్ ఉన్నా ఏమీ పట్టించుకోరని తెలుస్తున్నది.
అర్ధరాత్రి ఏసీబీ దాడులు
వాంకిడి రవాణాశాఖ చెక్‌పోస్టుపై బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ఐలయ్య అలియాస్ రవి, విజయ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ. 45,100 స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మాధవీ లత డ్యూటీలో ఉండగా, ఈ విషయమై ఎంవీఐ మాధవీలతను విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి తెలిపారు.