జన్నారం, అక్టోబర్ 24: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్లో సోమవారం రాత్రి బతుకమ్మ ఆడేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పాతపొనకల్ గ్రామానికి చెందిన పుపర్ల గంగన్న, లక్ష్మి దంపతుల కూతురు పుపర్ల రాహిత్య(15), తరాల సాగర్, జ్యోత్స్నదంపతుల కూతురు తరాల సాత్విక(18) స్నేహితులు. రాహిత్య, సాత్వికను గంగన్న తన బైక్ పై పొనకల్లో బతుకమ్మ వేడుకల వద్ద తీసుకెళ్తున్నాడు. చెక్కపెల్లి కుంటవద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108లో కరీంనగర్‌లోని ఓ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాహిత్య,సాత్విక మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. గంగన్నకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నది. సంతోషంగా పండుగను జరుపుకునేందుకే వీరిద్దరూ గ్రామానికి వచ్చారు. రాహిత్య చెన్నూర్ గురుకులంలో పదో తరగతి చదువుతుండగా, సాత్విక హైదరాబాద్‌లో లాంగ్‌టర్మ్ నీట్ కోచింగ్ తీసుకుంటున్నది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. గంగన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గుర్రం రాజారాంరెడ్డి, సులువ జనార్దన్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ భరత్‌కుమార్ పరామర్శించారు.