మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 8 : మంచిర్యాల జిల్లా అక్రెడిటేషన్ కమిటీలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) సంఘం తరఫున ప్రతిపాదించిన ‘నమస్తే తెలంగాణ’ మంచిర్యాల బ్యూరో ఇన్చార్జి గుల్లపెల్లి సిద్ధార్థను నామినేట్ చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 252ను అనుసరించి యూనియన్ ఏ సభ్యుల పేర్లను ప్రతిపాదిస్తే ఆ సభ్యులను తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ అక్రెడిటేషన్ కమిటీలో నామినేట్ చేయాలన్నారు.
పేర్లు మార్చడానికి, వ్యక్తిగతంగా తనకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు పెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్‌కు అవకాశం లేదన్నారు. కానీ.. మంచిర్యాల జిల్లా కలెక్టర్ తనకున్న విశేషమైన అధికారాలను దుర్వినియోగం చేస్తూ తనకు అనుకూలంగా వార్తలు రాసే వ్యక్తుల పేర్లను అక్రెడిటేషన్ కమిటీలో పెట్టడానికి ప్రయత్నిస్తూ జీవోను వాయిలెట్ చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వంగా కలెక్టర్ మా యూనియన్ ప్రతిపాదించిన పేరు పక్కన పెట్టారని ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంకను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. సంఘం ప్రతిపాదించిన సభ్యుడిని కమిటీలో నామినేట్ చేయాలన్నారు. జీవోను అనుసరించి ప్రభుత్వం మా యూనియన్‌కు ఇచ్చిన హక్కును కలెక్టర్ అడ్డుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయిస్తామని, మా హక్కును సాధించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, స్మాల్ పేపర్, ఫొటో జర్నలిస్ట్‌లు ఇలా మా యూనియన్ నుంచి నాలుగు లేఖలు వేరువేరుగా అన్ని జిల్లాలకు పంపించినట్లే మంచిర్యాల జిల్లాకు పంపించామన్నారు. యూనియన్ ప్రాథమిక సభ్యుడై ఉండి, దినపత్రిక లేదా ఛానెల్లో పని చేస్తున్న సభ్యుడు ఎవరి పేరునైనా యూనియన్ ప్రతిపాదిస్తే కచ్చితంగా వాళ్లను అక్రెడిటేషన్ కమిటీలో మెంబర్‌గా తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మంచిర్యాలలో అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ యూనియన్ ప్రతిపాదించిన పేరును కమిటీలో నామినేట్ చేయని పక్షంలో ఆయన విశేషమైన అధికారాలను వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్లేనని, ఈ విషయంపై న్యాయపోరాటం తప్పదన్నారు. ఇప్పటికైన మంచిర్యాల జిల్లా అధికారులు తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.