చెన్నూర్ టౌన్, ఆగస్టు 25 : శ్రీకృష్ణుడి జన్మాష్టమిని సోమవారం జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథిన కంసుడి చెరసాలలో ఆయన జన్మించగా, ఆనాటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఉట్ల పండుగ..
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బాలలకు కృష్ణుడిగా బాలికలకు గోపికలుగా వేషధారణ చేసి ఉట్ల వేడుకను జరుపుకుంటారు. అందనంత ఎత్తులో ఉట్టి కట్టి దాన్ని ఆనందోత్సాహల మధ్య కొడుతూ పండుగ చేసుకుంటారు. ఈ వేడుకల్లో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఉట్టికొట్టిన వారికి బహుమతులను కూడా ప్రదానం చేస్తారు. ఆలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లోనూ కృష్ణాష్టమిని జరుపుకుంటారు.
మహిళలు వేకువజామునే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, బియ్యం పిండితో శ్రీకృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్లుగా పాద ముద్రలు వేస్తారు. పూజలు చేసి అటుకులు, పాలు, పెరుగు, మీగడ, వెన్నవంటి వాటిని నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసి వీధుల్లో ఉట్టికొట్టే వేడుకలు జరుపుకుంటారు.