మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అందిస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు జిల్లాకు చేరాయి. నిర్మల్‌లోని ఎంసీహెచ్‌తో పాటు భైంసా, ఖానాపూర్ ఏరియా ఆసుపత్రులకు 1020 కిట్లు రాగా, వైద్య సిబ్బంది ప్రత్యేక గదుల్లో నిల్వ చేసింది. త్వరలో 16 పీహెచ్‌సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లకు మరో రెండు వేల కిట్లు వచ్చే అవకాశమున్నది. ఈ నెలాఖరులోగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
నిర్మల్, మే 14(నమస్తే తెలంగాణ) : మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు రక్తహీనతతో ప్రసవాల సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తూ భరోసానిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ కిట్ల పంపిణీ పథకం అమలవుతుండగా, తాజాగా దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాకు 1,020 కిట్లు వచ్చాయి. నిర్మల్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి 387, భైంసా ఏరియా ఆస్పత్రికి 510, ఖానాపూర్ ఏరియా ఆస్పత్రికి 123 కిట్లు చేరాయి. ప్రస్తుతం వీటిని ఆయా దవాఖానల్లోని ప్రత్యేక గదుల్లో నిల్వ చేశారు. ఎలుకలు, ఇతర కారణాలతో ఈ పోషకాహార కిట్లు పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులకు మాత్రమే న్యూట్రిషన్ కిట్లు వచ్చాయి. త్వరలో జిల్లాలోని 16 పీహెచ్‌సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లకు కూడా కిట్లు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పీహెచ్‌సీకి దాదాపు 100కు పైగా కిట్లు వస్తాయని చెబుతున్నారు. గర్భిణులు ఆరోగ్య పరీక్షల కోసం వచ్చినప్పుడు ఈ పోషకాహార కిట్లను అందజేస్తారు. ప్రతి గర్భిణీకి పీహెచ్‌సీల పరిధిలో 14 నుంచి 26 వారాల మధ్య మొదటి సారి, అలాగే 27 నుంచి 34 వారాల మధ్య రెండో సారి ఈ కిట్లు అందిస్తారు. ప్రధానంగా రక్తహీనత కారణంగా ప్రసవాల సమయాల్లో తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముండడంతో ఈ పోషకాహార కిట్లు అందిస్తున్నారు. ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే ఈ కిట్ల లక్ష్యం. రూ.1,962 విలువ గల ఈ కిట్‌తో బలవర్ధకమైన పోషకాహారం అందుతుంది.
కిలో న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్, కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, బెల్లం, పల్లిపట్టీలు,ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు, ప్లాస్టిక్ బాస్కెట్, కప్పు ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 800 మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలో నెలాఖరు లోగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలోని 3 ప్రధాన ఆసుపత్రులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు వచ్చాయి. ఇంకా పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తాం. పోషకాలతో కూడిన ఈ కిట్లతో గర్భిణులకు మేలు జరుగుతుంది. గర్భం దాల్చిన తర్వాత తొమ్మిది నెలల్లో రెండుసార్లు ఈ కిట్లను అందజేస్తాం. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం.
– డాక్టర్ ధన్‌రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నిర్మల్