ఎదులాపురం, మార్చి 5 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీవోఈసెట్-23), తెలంగాణ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీయూజీ సెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి తెలిపారు. ఆదిలాబాద్‌లో ఆరు, మంచిర్యాలలో 8, ఆసిపాబాద్ జిల్లాలో ఆరు చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీవోఈ సెట్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. టీజీ యూజీ సెట్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సీవోఈ సెట్‌కు 6,719 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,365 మంది పరీక్షలు రాశారు. 354 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మొత్తంగా 94.74 శాతం హాజరయ్యారు. టీజీయూజీ సెట్‌కు 2,207 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,023 మంది హాజరయ్యారు. 184 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీవో స్వరూపారాణి మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో సీట్ల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరీక్షా కేంద్రాలను ఏఆర్సీవో మహేశ్ తనిఖీ చేశారు.
నిర్మల్ జిల్లాలో..
సారంగాపూర్/ సోన్, మార్చి 5 : సారంగాపూర్ మండలంలోని జామ్ బాలికల గు రుకుల విద్యాలయంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సీవోఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ రమాకళ్యాణి తెలిపా రు. మొత్తం 455 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 430 మంది హాజరయ్యారు. 25 మంది గైర్హాజరయ్యారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్యామలారాణి ఆధ్వర్యంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ విభాగంలో మొత్తం 450 మంది విద్యార్థులకుగాను 413 మంది హాజరయ్యారు. 42 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ సరస్వతి తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని గురుకుల విద్యా సంస్థల ప్రాంతీయ కార్యదర్శి మేరియేసుపాదం తనిఖీ చేశారు.