బోథ్, మార్చి 30 : ఆదివాసీ సంప్రదాయం ప్రకారం చేసే పెళ్లి వేడుకలకు ఖర్చులు తగ్గించుకోవాలని పార్డి(బీ) గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం సొనాల మండలంలోని పార్డి(బీ) గ్రామంలో ఆదివాసీ గిరిజనులంతా సమావేశమయ్యారు. పెళ్లి కానుకల గురించి చర్చించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబీకులకు అహెరాలు(బట్టలు పెట్టడం) చేయరాదని నిర్ణయించారు.
వాటికి బదులుగా తోచినంత ఆర్థిక సహాయం చేయాలని తీర్మానించారు. రక్త సంబంధీకులు మినహా మిగతా వారు అహెరాలు చేయొద్దని ఒప్పందం కుదుర్చారు. వీటితోపాటు ఎర్ర బొట్టుకు వెళ్లే సమయంలో ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా రెండు వాహనాలు మాత్రమే తీసుకెళ్లాలని, అంతకు మించి వాడితే రూ.5 వేలు జరిమానా విధించాలని తీర్మానించారు.