ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబా ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం కనులపండువగా కొనసాగాయి. మెస్రం వంశీయుల పీఠధిపతి వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. మెస్రం వంశీయులు, భక్తులు ఆలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటు చేశారు. సతీదేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. ఆలయ ఆవరణలో రెండు గంటలపాటు హోమం నిర్వహించారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. కేస్లాపూర్ జనసంద్రమైంది. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ నగేశ్, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, జనార్దన్ రాథోడ్ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్ 18 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నూతనంగా పునఃనిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆదివాసీ గిరిజన వేద పండితులు ఆత్రం పురుషోత్తం మహారాజ్, కొడప వినాయక్ మహారాజ్, భీంరావ్ మహారాజ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ముందుగా మెస్రం వంశీయులు నూతనంగా నిర్మించిన ఆలయంలో కొత్త నాగోబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం సతీక్దేవత ఆలయంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా ఆలయంతోపాటు సతీక్‌దేవతల ఆలయ శిఖరాలపై నూతన కలశాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో రెండు గంటలపాటు హోమం నిర్వహించి వేడుకలకు ముగింపు పలికారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులతోపాటు భక్తులు వేలాదిగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. ఎటు చూసినా వేలాది మంది భక్తులు దర్శనమిచ్చారు.
వేడుకలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖులు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖానాయక్, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంపీ సోయం బాపురావ్, మాజీ జడ్పీ చైర్మన్ సుహాసినిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, సత్తుపల్లి ఏసీపీ వేంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్, ఇంద్రవెల్లి జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌జాదవ్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఉట్నూర్ ఎంపీపీ ఫంద్ర జైవంత్రావ్తోపాటు ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆలయంలో పూజలు చేశారు. వీరికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. నాగోబా ఫొటోలను బహూకరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే నాగోబా ఆలయం అభివృద్ధి చెందిందని మాజీ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్‌తో కలిసి ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6 కోట్లతో ప్రకార మండపంతోపాటు నాలుగు రాజగోపురాలు ధ్వజస్తంభం నిర్మించామన్నారు. ఈ నిధులు సరిపోకపోవడంతో అదనంగా రూ.7.50 కోట్ల మంజూరుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎస్డీఎఫ్ ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెస్రం వంశీయులు సేకరించిన రూ.5 కోట్లతో చరిత్రలో నిలిలా నాగోబా ఆలయ పునఃనిర్మాణం చేయడం గర్వకారణంగా ఉంది. నూతనంగా నాగోబా ఆలయంపై వివిధ రకాల శిల్పాలు మెస్రం వంశీయుల సంస్కృతీ సంప్రదాయాలు తెలిపేవిధంగా ఉన్నాయన్నారు. భక్తులకు శాశ్వతమైన మౌలిక సదుపాయల కోసం ఐటీడీఏ ద్వారా నిధులు మంజూరు చేసిందన్నారు.