నిర్మల్ అర్బన్, జనవరి 10 : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాల్టీలలో జనవరి 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో? లేవోనని తెలుసుకొనేందుకు ఓటర్లు, నాయకులు, పోటీ చేసే ఆశావహులు తమ ఓటర్ల కోసం వెతుకుతున్నారు. ఖానాపూర్ మున్సిపాల్టీలో ముసాయిదా జాబితా పూర్తిగా సవరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నిర్మల్, భైంసాలలో ఆయా పార్టీల నేతలు, నాయకులతో ముసాయిదా ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించగా తప్పుల తడక జాబితాతో అధికారులను ఆయా పార్టీల నేతలు నిలదీశారు. ఒక వార్డులోని ఓటర్లు ఇతర వార్డులోకి.. ఇతర గ్రామాల ఓటర్లు మరో వార్డులోకి.. ఇతర జిల్లాల ఓటర్లు పట్టణాలలో ప్రత్యక్షమవ్వడంతో అందరూ కంగుతిన్నారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో 1,67,100 మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్ ప ట్టణంలో 42 వార్డులు.. 98,295 ఓటర్లు ఉ న్నారు. ఇందులో 50,878 మంది మహిళలు, 47,399 పురుషులు, ఇతరులు 18 మంది ఉ న్నారు. భైంసాలో 26 వార్డుల్లో 51,118 మం ది ఉన్నారు. ఇందులో మహిళలు 25,623, పురుషులు 25,486, ఇతరులు 9 ఉన్నారు. ఖానాపూర్‌లో 12 వార్డులకు గాను మొత్తం 17, 693 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8524, మహిళలు 9169 ఉన్నారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాల్టీలలో ఈనెల 1వ తేదీన ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు అందించాలని మున్సిపాల్టీలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలను శుక్రవారం రాత్రి వరకు స్వీకరించారు. మూడు మున్సిపాల్టీలలో 1380 దరఖాస్తులు రాగా.. నిర్మల్ మున్సిపాల్టీలో 675 అభ్యంతరాలు, ఖానాపూర్‌లో 570, భైంసాలో 135 అభ్యంతరాలు వచ్చాయి. అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఎంఐఎం పార్టీల నేతలు ముసాయిదా జాబితాతో తలలు పట్టుకుంటున్నారు. అభ్యంతరాలను విన్నవించడంతో కొంత మేరకు శాంతించినా తుది జాబితా సక్రమంగా వెలువడేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డులవారీగా ఓటరు లిస్ట్ సక్రమంగా ఉండేనా? అనే ఆందోళన మరో పక్క ఉంది.
మూడు మున్సిపాల్టీలలో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉండగా.. వాటిని సవరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. క్షుణ్ణంగా పరిశీలించి ఇతర వార్డుల ఓట్లు, ఇతర గ్రామాల ఓటర్లను తీసివేసి స్థానికుల ఓట్లను జాబితాలో సక్రమంగా చేయనున్నారు. ఆయా వార్డుల బౌండరీలు, ఇంటి నంబర్ల వారీగా జాబితాను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. తుది జాబితాను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు. కాగా.. అభ్యంతరాలను శుక్రవారం వరకు స్వీకరించామని, వాటిని సవరించి, ఈనెల 12వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు.