తలమడుగు, జూలై 29 : తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి ఆత్రం గంగామణి మంగళవారం కిడ్నాప్‌కు గురైన ఘటనలో జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి ఆరు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బుధవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈనెల 28న రుయ్యాడి గ్రామానికి చెందిన నిందితురాలు నైతం నాగుబాయి చిన్నారిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొచ్చి బస్టాండ్ ప్రాంతంలో తనకు తెలిసిన భారతి అనే మహిళకి అప్పగించింది.
బాధితురాలి తల్లి ఆత్రం కప్లిబాయి తలమడుగు పోలీస్ స్టేషన్లో సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రహీం పాషా, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తలమడుగు ఎస్సై డి.రాధిక, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆదిలాబాద్, తాంసి తదితర ప్రాంతాల్లో విసృ్తతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
గత రాత్రి 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడ నందు చిన్నారి ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం బుధవారం ఉదయం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఎస్పీ చిన్నారిని ఆమె తల్లిదండ్రులైనా ఆత్రం జంగు, ఆత్రం కప్లీ బాయికు అప్పగించారు. కిడ్నాప్ చేసిన నైతం నాగుబాయి, చట్ట వ్యతిరేకంగా తన వద్ద బాలికను ఉంచుకున్న గుమ్మడి వార్ భారతి అనే మహిళను అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో ఈ మహిళ భారతిపై వ్యక్తిపై దాడి చేసిన కేసు, తన కుమార్తెను రిమ్స్‌లో వదిలిపెట్టిన ఘటనలు నమోదైనట్లు తెలిపారు.