ఆదిలాబాద్ రూరల్, జూన్ 29 : పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఉన్న ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ 26వ వార్షికోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకల్లో భాగస్వాములయ్యారు. కాలనీ మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. ముందుగా డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో శివాజీ చౌక్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు మంగళహారతులతో నడువగా, పోతరాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సైతం బోనం నెత్తిన పెట్టుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు.
అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. భక్తుల కోసం మహాన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మారెమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా పాడి పంటలతో సుఖిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాదన్ గంగన్న, పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ ప్రకాశ్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బండారి దేవన్న, బాదం గంగన్న పాల్గొన్నారు.