కడెం, జూలై 5 : కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండారపు శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాల్‌కు చెందిన యమునూరి రవీందర్‌లు 2023 సంవత్సరంలో మలేషియా వెళ్లారు. ఏజెంట్ చేసిన మోసానికి, కంపెనీలో పనిలేక ఏడాదిలోపే జైలు పాలయ్యారు. నెలకు రూ.30 వేలకు పైగా సంపాదించవచ్చని ఆశ చూపి ఓ ఏజెంట్ పలువురిని మలేషియా పంపించాడు. రూ.60 వేలు కట్టి మాలేషియా వెళ్లారు.
అక్కడ అల్యూమినీయం కంపెనీలో సదురు ఏజెంట్ లేబర్ పనులు చూపించాడు. దాదాపు నాలుగు నుంచి ఆరు నెలలు బాగానే పనిచేశారు. అనంతరం అక్కడ పనులు లేవని కంపెనీ వారు పనిలో నుంచి తీసేశారు. దీంతో పస్తులుంటూ, ఏదైన ఉపాధి వెతుక్కుందామని తిరుగుతున్న క్రమంలో అక్కడి పోలీసులకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి దాదాపు 17 నెలలుగా జైలు జీవితం గడుపుతూ వస్తున్నారు. అయితే మలేషియాకు విజిట్ వీసా మీద వెళ్లిన వారికి గతంలో పర్మినెంట్ చేసుకోవాలంటే దాదాపు రూ.2లక్షలకు పైగా చెల్లించాలి.
ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఈ నిబంధననను ఎత్తివేసింది. దీంతో చేసేదేమిలేక జైలులో మగ్గారు. అక్కడే పనులు చేస్తున్న కొందరు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్‌నాయక్‌కు తెలిపారు. ‘తమ కుటుంబ సభ్యులు మలేషియా జైలులో చిక్కుకున్నారని, మా వారిని విడిపించాలని’ జాన్సన్‌నాయక్‌ను వేడుకున్నారు. దీంతో విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సలహా మేరకు జాన్సన్ బాధితులకు అండగా నిలిచారు.
మలేషియా వెళ్లి భరోసా కల్పించి..
జాన్సన్ నాయక్ గత మార్చిలో మలేషియా వెళ్లారు. అక్క డ జైలులో మగ్గుతున్న ఆరుగురిని కలిసి ఆధైర్యపడొద్దని, తమను ఇంటికి క్షేమంగా తీసుకెళ్తానని భరోసా కల్పించారు. కేటీఆర్ చొరవతో దాదాపు మూడు నెలలపాటు అనేక సందర్భాల్లో మాలేషియా వెళ్లారు. అక్కడ సొంతగా ఇద్దరు లాయర్లను నియమించి, వారిని బయటకు తెప్పించే ప్రయత్నం చేశారు. తిరిగి మే 12వ తేదీన మలేషియాకు వెళ్లిన జాన్సన్‌నాయక్ వారి కేసు విషయంలో అధికారులతో మాట్లాడి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో వారికి విముక్తి లభించింది. అక్కడి కోర్టు విధించిన జరిమానాతోపాటు, విమాన టికెట్లతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి స్వదేశానికి తీసుకొచ్చారు.
విముక్తి కల్పించిన దేవుళ్లు..
ఏజెంట్ చేసిన మోసం, విజిట్ వీసా కారణంగా మేము జైలు పాలయ్యాం. దాదాపు 17 నెలలపాటు శిక్ష అనుభవించినం. ఇక మా జీవితాలు మలేషియా జైలుకే అంకితమవుతాయని అనుకున్నాం. కానీ.. దేవుడిలా మా దగ్గరి వచ్చి మాకు కొండంత ధైర్యాన్ని నింపి, మమ్మల్ని ఇంటికి చేర్చారు. జైలులో సరైన తిండిలేక ఎన్నో రోజులు పస్తులున్న సందర్భాలున్నాయి. మాకు పునర్జన్మ కల్పించిన జాన్సన్ అన్న, కేటీఆర్ సర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– రాచకొండ నరేశ్, లింగాపూర్, కడెం.
ఇంటికొస్తామని అనుకోలేదు..
జైలు నుంచి మమ్మల్ని విడిపించి ఇంటికి రప్పించిన కేటీఆర్‌కు, జాన్సన్‌నాయక్‌కు రుణపడి ఉంటాం. దాదాపు 17 నెలలపాటు జైలు జీవితం గడిపిన మాకు ఈ ఇద్దరి వల్ల విముక్తి లభించింది. జైలులో నుంచి మేము ఇంటికి వస్తామని కలలో కూడా అనుకోలేదు. జాన్సన్ అన్న మా దగ్గరికి మూడుసార్లు వచ్చారు. మీకు నేనున్న అనే భరోసా కల్పించి, మామ్మల్ని ఇంటికి తీసుకొచ్చే వరకు అండగా నిలిచారు.
– యమునూరి రవీందర్, మున్యాల్, దస్తురాబాద్.