కుభీర్ : బంజారాల సాంప్రదాయ వేడుకగా తీజ్ పండుగను ( Teej celebrations ) గిరిజనులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer Mandal ) మండలంలోని రంజిని తండాల్లో గిరిజనులు ప్రతి ఏటా భాద్రపద మాసం మొదటి వారంలో తట్ట, బుట్టలలో నవధాన్యాలను మొలకెత్తించి నీళ్లు పోసి తొమ్మిదవ రోజున నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని గిరిజనులు తెలిపారు.
తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లీడు యువతులు తొమ్మిది రోజులపాటు ఉపవాసాలు ఉండి బుట్టల్లోని నవధాన్యాల మొలకలకు నీళ్లు పోసి పూజలు చేయడం ఈ తీజ్ పండుగ ప్రత్యేకత. అనంతరంతాండలోని దుర్గాదేవి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులు బంజారా పాటలను ఆలపిస్తూ డీజే చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. యువకులు, గిరిజన మహిళలు సైతం ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తండా నాయక్ జాదవ్ సాహెబ్ రావు, గులాబ్ నాయక్, రాథోడ్ హరిలాల్, జాదవ్ కిషన్, తండా గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.