శ్రీరాంపూర్, అక్టోబర్ 5 : ‘జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు సర్కారుతో కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. ఒక్కో కార్మికుడికి రూ. 4 లక్షల వాటా రాకుండా చేశాయి.’ అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే-6 గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సర్కారుకు లొంగిపోయి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ. 4701 కోట్ల లాభాల్లో 33 శాతం అంటే రూ. 1551 కోట్లు కార్మికులకు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ కేవలం రూ. 796 కోట్లు ఇస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దమ్ముంటే సింగరేణికి బకాయిలున్న రూ. 23 వేల కోట్లను తెప్పించాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ కార్మికుల పక్షాన నిలబడి.. యాజమాన్య వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నదన్నారు. కార్మికుల కోసం సర్కారు ఆనుకూల సంఘాలు పోరాడ లేవని, దీనివల్ల కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
ఈ విషయాన్ని కార్మికులు గమనించాలని కోరారు. కేసీఆర్ సర్కారులో కార్మికులకు అనేక హక్కులు, సౌకర్యాలు కల్పించామని, ఆయన వల్లే ఈ రోజు 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రాజకీయజోక్యంతో కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కొందరైతే ఎమ్మెల్యేలు జీఎంలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్నేహ పూర్వక వాతావరణం ఉండేదని తెలిపారు.
33 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న గోదావరిఖని హెడ్డాఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నామని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హాజరవుతారని, కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యర్శి బండి రమేశ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, కేంద్ర నాయకులు ముత్యాల రమేశ్, గొర్ల సంతోష్, మహిపాల్‌రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, ఉత్తేజ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మనిధర్, కిషోర్, చిప్ప రమేశ్, తుర్రం శ్రీకాంత్, రాజేందర్, మధుకర్, చాట్ల రమేశ్ పాల్గొన్నారు.