సారంగాపూర్, జూలై 26 : ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, తెలంగాణ గురుకులాలు, ఆదర్శ కళాశాలల్లో మాదిరిగానే 2026-2027 ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నరదాటినా కార్యరూపం దాల్చకపోవడంతో తరగతి గదుల్లో ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఇంటర్మిడియెట్ జూనియర్ కళాశాలల్లో ఉదయం 9:30 గంటలకే తరగతులు ప్రారంభమవుతాయి. చాలా మంది విద్యార్థులు ఉదయం అల్పాహారం చేయకుండానే కళాశాలలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం ఒంటి గంటకు తినాలంటే అంతగా రుచిగా లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు తినకుండానే పస్తులుంటున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వరకు తరగతులు వినాలంటే అంతగా ఆసక్తి ఉండడం లేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం అమలైతే నిర్మల్ జిల్లాలో 5260 విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదవారే ఉన్నారు. వారిలో సమీప గ్రామాలతోపాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సైతం ఉంటారు. వారు ఉదయాన్నే కళాశాలకు వస్తుండడంతో ఆకలితో అలమటించకుండా పాఠాలు శ్రద్ధగా వినేందుకు ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. కానీ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటున్నారు.
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 13
జిల్లాలో మొత్తం విద్యార్థులు : 5260
ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 2760
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 2500
ప్రభుత్వం త్వరగా మధ్యాహ్న భోజనా న్ని ప్రారంభించాలి. ఉదయం కళాశాల ఉదయం 9:30 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు ఉంటుంది. దీంతో అరగంట ముందుగానే కాలేజీకి చేరుకుంటున్నాము. ఇంట్లో ఉదయం అన్నం వంట వండడం కాకపోవడంతో ఆకలితో పస్తులుంటున్నాం. పాఠాలు వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం స్పందించి త్వరగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలి.
-ఆత్రం లక్ష్మణ్, ఇంటర్, ప్రథమసంవత్సరం, చించోలి(బీ)
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే విద్యార్థులమంతా సంతోషించాము. కానీ తరగతులు ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో ఆకలితోనే తరగతులు వింటున్నాము. దీంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నాము.
-సోనా, ఇంటర్, ద్వితీయ సంవత్సరం, సిర్పెల్లితండా
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఇంటర్మిడి యెట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తాం.
-జాదవ్ పరశురాం, నిర్మల్ జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి