మంచిర్యాలటౌన్, డిసెంబర్ 15 : గ్రూప్-2 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ స్కూల్, ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ, వేంపల్లిలోని పరీక్షా కేంద్రాలను డీసీపీ భాస్కర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో మొత్తం 66 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయని, అన్ని కేంద్రాల వద్ద సెక్షన్-163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పరీక్షల అనంతరం ఎగ్జామ్స్ షీట్స్‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే విషయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తమ పరిధిలోని 66 పరీక్షా కేంద్రాల నుంచి 15 రూట్లలో 411 మంది సిబ్బంది, అధికారులతో కలిసి తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీపీ, డీసీపీలతో పాటు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐ ప్రమోద్‌రావు, లక్షెట్టిపేట సీఐ నరేందర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు.