మంచిర్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనుమతులు లేని లే-అవుట్లలోని ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ సిద్ధమయ్యారనే ఆరోపణలు కొన్ని రోజులుగా వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంచిర్యాల కార్యాలయం నుంచి ఇప్పటి వరకు చేసిన రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం తీసుకెళ్తున్నట్లు రవీందర్రావు తెలిపారు. ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ వాయిలేషన్ జరిగినట్లు తేలినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇక నుంచి నెలకు ఒకసారైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తనిఖీ చేస్తానని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్లు చేసే డాక్యుమెంట్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.