ఆదిలాబాద్/ నిర్మల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కనులపండువగా కొనసాగాయి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఎగుర వేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఎగుర వేశారు.
అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పించారు. కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేయగా.. వారితోపాటు రామన్న కూడా స్టెప్పులు వేశారు. బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిషరించారు. నార్నూర్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఉట్నూర్‌లోని ఐటీడీఏలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పీవో ఖుష్బూ గుప్తా జాతీయజెండాను ఎగురవేశారు. భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే రామారావు పటేల్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్ జెండాలను ఎగురవేశారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు.
నిర్మల్ కలెక్టరేట్‌కే పరిమితమైన సంబురాలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యేటా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ వేడుకలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో కాకుండా కేవలం కలెక్టరేట్‌కే పరిమితం చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు హాజరు కాలేకపోయారు. కేవలం అధికారులతోనే సంబురాలు జరిపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.