ఎదులాపురం, నవంబర్14: నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పర్చుకుని ఆ దిశగా కష్టపడి చదవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం మావలలోని శ్రీచైతన్య పాఠశాలలో చిల్డ్రన్స్ డేను పురసరించుకొని నిర్వహించిన ఫుడ్ మేళాను ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన వంటకాల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రు కూడా పిల్లలను పూలతో పోల్చారని, అలాంటి విద్యార్థులు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలన్నారు.
మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు తెలియజేయాలన్నారు. పిల్లలు బయట జంక్ ఫుడ్ తినడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, మావల సీఐ కర్రె స్వామి,శ్రీచైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్, డీన్ నవీన్, ప్రైమారీ, ప్రీ ప్రైమరీ ఇన్చార్జిలు సోనం, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సోన్, నవంబర్ 14 : నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ పాల్గొన్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో నాగలక్ష్మి, ఇన్చార్జి సూపర్వైజర్ విజయగౌరి, ఎంపీడీవో గజానంద్రావు, తదితరులున్నారు.