శ్రీరాంపూర్, నవంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం తప్పదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే వీరభద్రయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు సదానందం మాట్లాడారు.
లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 25న సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీపీలపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడుతామని, 26న కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని, అదే రోజు సాయంత్రం జీఎం కార్యాలయాల ఎదుట 3000 మంది కార్మికులతో మహా ధర్నా చేపడుతామన్నారు. సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, మెరుపు సమ్మెలకు అవకాశం లేదన్నారు. దేశంలో రాజకీయ పార్టీలకు లేని 51 శాతం ఓటింగ్, కార్మిక సంఘాలకు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
దేశంలో బీజేపీ 51 శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక చట్టాలు, నాలుగు కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, టీబీజీకేఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఏరియా కార్యదర్శి గడ్డం మహిపాల్‌రెడ్డి, వెంగళకుమారస్వామి, తొంగల రమేశ్, ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గరిగె స్వామి, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి తిరుపతిరాజు పాల్గొన్నారు.