శ్రీరాంపూర్/మందమర్రి/రామకృష్ణాపూర్/సీసీసీ నస్పూర్/రెబ్బెన/తాండూర్, డిసెంబర్ 26 : సింగరేణిలో ఈ నెల 27న ఏడోసారి గుర్తింపు సంఘం ఎన్నిక లు జరుగనున్నాయి. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలిం గ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. గుర్తిం పు పోరులో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. మొత్తం 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి, శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఆర్టీవో, తహసీల్దార్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. పోలింగ్ రోజు ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.
మందమర్రిలో..
మందమర్రి ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెం డు ఉపరితల గనులుండగా ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా గనులతోపాటు ఏరియా వర్క్‌షాప్, వైద్య విభాగం, సివిల్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లలో మొత్తం 4,835 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. ఏరియాలో 11 మంది పీవోలు, 11 మంది ఏపీవోలు, 22 మంది వివిధ శాఖల అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈఆర్ క్లబ్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేశారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో బూత్‌లకు తరలివెళ్లారు. బెల్లంపల్లి ఏసీపీ పంతా టి సదయ్య ఆధ్వర్యంలో మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ చంద్రకుమార్తోపాటు ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలతో 165 మంది సిబ్బం ది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అన్నిచోట్ల 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
జైపూర్ ఏసీపీ పర్యవేక్షణలో బందోబస్తు
సింగరేణిలోనే పెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్‌లో 9,149 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా ఓటు వేసేందుకు శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికో ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇద్దరు ఇతర పోలింగ్ ఆఫీసర్లను కేటాయించారు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో జైపూర్ ఏసీపీ మోహన్ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సీసీసీలోని సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌కు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు. ఇక్కడే కౌంటింగ్ నిర్వహించనున్నారు. జైపూర్ ఏసీపీ మోహన్, శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
బెల్లంపల్లి ఏరియాలో..
బెల్లంపల్లి ఏరియాలోని వివిధ గనులు, డిపార్టుమెంట్లలో 996 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఏరియాలో మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బూత్కొకరి చొప్పున ఐదుగురు పీవోలు, ఒక రిజర్వ్ అధికారి, ఐదుగురు ఏపీవోలు, 10 మంది అదనపు ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఆఫీసర్లు, ఇద్దరు రిజర్వ్ ఆఫీసర్లు, కౌంటింగ్ కోసం నలుగురు సూపర్వైజర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కేజే మహంతి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని తెలిపారు. 5 పోలింగ్ కేంద్రాలతోపాటు కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆసిఫాబాద్ డీఎస్పీ వెంకటరమణ, బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కేజే మహంతి పరీశీలించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఆరుగులు ఎస్ఐలు, 50 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. రెబ్బెన ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, సీఐ అల్లం నరేందర్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏరియా ఎస్వోటూజీఎం మచ్చగిరి నరేందర్, ఐఈడీ ఆధికారి ఉజ్వల్కుమార్బెహరా, సెక్యూరిటీ అధికారి వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో మండల శ్రీనివాస్ ఉన్నారు.