మంచిర్యాల అర్బన్, జూలై 28: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఎక్స్‌రే సేవలు నెల రోజులుగా నిలిచిపోవడంతో రో గులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. దవాఖానలోనే చేయాల్సిన పరీక్షల కోసం రోగులను ప్రభుత్వ 108 అంబులెన్స్ లో తెలంగాణ డయాగ్నోస్టిక్ టీ-హబ్‌కు తరలిస్తున్నారు. దీంతో చికిత్స ఆలస్యమవడంతో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యు లు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రమాదాలు, ఎముకల గాయాలు, పడిపోవడం వంటి అత్యవసర కేసుల్లో ఎక్స్‌రే కీలకమైనప్పటికీ, యంత్రాలు పని చేయకపోవడంతో ముందుగా టీ-హబ్‌లో పరీక్షలు చేయించుకుని, మళ్లీ ప్రభుత్వ దవాఖానకు రావాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నొప్పులతో బాధపడుతుంటే, మరోవైపు పరీక్షల కో సం తరలింపు మరింత ఇబ్బందిగా మా రిందని వాపోతున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు శాశ్వత పరిషారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రాలైన జీజీహెచ్, ఎంసీహెచ్‌లో ప్రాథమిక నిర్ధారణ సేవలు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎక్స్ రే యంత్రాలను మరమ్మతుల చేసి సేవలను పునరుద్ధరించాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.