బెల్లంపల్లిరూరల్, మార్చి 9 : మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతరలో సౌకర్యాలపై దేవాదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. బెల్లంపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోనున్న ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉండగా, కనీసం నీళ్లతో క్యూరింగ్ చేయకపోవడంతో భక్తులు దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆదాయంపై చూపిన శ్రద్ధ సౌకర్యాలపై చూపించలేదని వా రు మండిపడ్డారు.
జాతరలో స్వచ్ఛంద సంస్థ ల నిర్వాహకులు తాగునీరు, అల్పాహారం, మజ్జిగలాంటివి అందించగా, అధికారులు, కమిటీ సభ్యులు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించలేదు. పైగా భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేకపోయామంటూ బహిరంగంగానే దేవాదాయశాఖ అధికారులు మైకుల్లో అనౌన్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక జాతర హుండీ లెక్కింపు సమాచారం కూడా బయటికి పొక్కకుండా రహస్యంగా నిర్వహిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
మరోవైపు రెవెన్యూ డివిజనల్ అధికారి నుంచి వీఐపీ, ప్రెస్ పాసులు జారీ చేయగా, అవి ఎందుకూ పనికిరాలేదు. వీఐపీ పాసుల్లో ఉదయం 9 గంటల వరకే దర్శనం కోసం అనుమతి అని ఉండగా, రాత్రి వరకూ వారికి ఆ భాగ్యం కలగలేదు. మీడియాకు పాసులిచ్చి అవమానపర్చే విధంగా వ్యవహరించారు. ప్రత్యేక పాసులుగా పేర్కొన్నప్పటికీ భక్తులు, వీఐపీల దర్శనం ఫొటోలను కవరేజ్ చేసేందుకు ఆలయంలోకి అనుమతించలేదు. జాత ర కవరేజీకి వచ్చిన మీడియా పట్ల దేవాలయ కమిటీకి చెందిన కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రత్యేక ప్రెస్ పాసులు ఉన్నప్పటికీ మీడియాను నేరుగా అనుమతించకుండా భక్తులతోపాటే క్యూలైన్లో పంపించారు.
ప్రముఖుల ఫొటోల కవరేజ్‌లో మీడియాకు అడుగడుగునా కిందిస్థాయి పోలీసుసిబ్బంది, దేవాలయ కమిటీ సభ్యుల నుంచి ఇబ్బందు లు తప్పలేదు. కనీసం రాత్రి 10 గంటలకు జరిగిన శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సైతం అనుమతించలేదు. వెనుక ద్వారం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రెస్ పాసు లు చూపించినా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఒక ఎస్సై స్థాయి అధికారి ఓ పాత్రికేయుడిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసు అధికారుల కుటుంబసభ్యులు, ఇతర ఉన్నతాధికారులు మాత్రమే దేవాలయం వెనుక ద్వారం గుండా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.