ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంలో పడింది. ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయంపై సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్‌రెడ్డి, ఇతర నాయకులు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఆదిలాబాద్ టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని వారు కోరుతున్నా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ రెబల్‌గా పార్టీ సీనియర్ నాయకుడు సంజీవ్‌రెడ్డి పోటీ చేయనున్నారు.
ఆదిలాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిలా కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం తమకు అన్యాయం చేసిందంటూ సీనియర్లు మండిపడుతున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల సేవ్ కాంగ్రెస్ ఫ్రం ఆర్ఎస్ఎస్ పేరిట కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, పారాచూట్ లీడర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్‌ను తమకు ఇవ్వాలని సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవ్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కంది శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వవద్దంటూ సూచించారు. నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉండి, గెలిచే వ్యక్తిని గుర్తించాలన్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం కోసం కృషి చేస్తామని నాయకులకు సూచించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ నియోజకవర టికెట్‌ను రెండో జాబితాలో కంది శ్రీనివాస్‌రెడ్డికి కేటాయించారు. దీంతో ఆగ్రహంలో ఉన్న సీనియర్లు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం డబ్బులు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చిందని, టికెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని సూచించారు. అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించారు. ముగ్గురు సీనియర్లతో పాటు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పార్టీకి నేడు రాజీనామ చేయనున్నారు. కాంగ్రెస్ రెబల్‌గా సంజీవ్‌రెడ్డిని పోటీలో నిలుపనున్నట్లు వారు పేర్కొన్నారు.