ఎదులాపురం, జూలై 22 : “అపరిశుభ్ర వాతావరణంలో వంటలు ఎలా చేస్తున్నారు? మీ పిల్లలకు మీ ఇంటి ప్రదేశంలో ఇలా ఉంటే వంటలు చేసి పెడతారా? వంట పాత్రలు కడిగిన నీరు ఇక్కడే నిలిచి ఉంటుందా? ఈగలు అధిక సంఖ్యలో ఉన్నాయి? మరుగుదొడ్లు, పి చ్చిమొక్కలు ఇలానే ఉండేది?” అని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బోనగిరి సౌజన్య వంట సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె సందర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ చాంబర్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం వంటశాల గదులను సందర్శించారు. మధ్యాహ్నం వంట సామగ్రిని పరిశీలించారు. మొదటి సారి తనిఖీ చేశా.. మళ్లీ వచ్చే సమయానికి ఇది మారకపోతే… మీతోపాటు ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది.