మంచిర్యాలటౌన్/సీసీసీ నస్పూర్/నస్పూర్, ఫిబ్రవరి 23 : ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాకు వస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చుకున్నారు. నస్పూరులోని కలెక్టరేట్ భవన సమీపంలో పట్టభధ్రుల ఆత్మీయ సమ్మేళన సభ కోసం పలు ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.
జిల్లాలో రెండు ట్రస్మాలు ఉండగా, ఒకవర్గం సంత్లాల్ జయంతి సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించగా, మరో వర్గం సీఎం పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల మద్దతు కోసం ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించి, టీచర్లను కూడా మీటింగ్‌కు తరలిస్తారేమోనని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభకు హాజరుకానున్నారు.