ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధితోపాటు ఇతర రంగాలకు చేయూత అందిస్తున్నది. అభివృద్ధి పనులు చేపట్టడం, అవసరమైన నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీ పడుతున్నది. ఇప్పటికే ఐటీ రంగం విస్తరించగా, విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి తమ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌కు ప్రభుత్వం వ్యవసాయ కళాశాల మంజూరు చేసింది. ఆదిలాబాద్‌లో వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలిక కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కాలేజీలో ఎంసెట్‌లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో అడ్మిషన్లు లభిస్తాయి.
ఆదిలాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభు త్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితం గా తొమ్మిదేండ్లలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసా యం, ఉపాధి ఇతర రంగాలు మెరుగుపడ్డాయి. రిమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతుండగా, వివిధ విభాగాల్లో పీజీ చదువుకునే అవకాశాలు లభించాయి. కాగా.. ప్రభుత్వం జిల్లాకు కొత్తగా వ్యవసాయ కళాశాలను ముంజూరు చేసింది. ఈ కాలేజీలో విద్యార్థులు వ్యవసాయ వృత్తి విద్యా కోర్సును అభ్యసించి, ఉద్యోగం పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం
ప్రభుత్వం మంజూరు చేసిన ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం(2023-24) నుంచి ప్రారంభమవుతాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 60 సీట్లను భర్తీ చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు కౌన్సెలింగ్‌లో భా గంగా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం కల్పించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సును నాలుగేండ్లపాటు చదువుకుంటారు. జిల్లా విద్యార్థులు స్థానికంగా ఉంటూ చదువుకునే అవకాశం లభిస్తున్నది. ఏటా ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 60 సీట్లు భర్తీ అవుతాయి. కళాశాల ఏర్పాటుతోపాటు 110 మంది ఉద్యోగుల నియామకం చేపడుతారు. వీరిలో 66 మందిని రెగ్యూలర్, 44 మందికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకుంటారు విద్యార్థులకు బోధించడానికి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో అవసరమైన సిబ్బందిని నియమిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రంలో తాత్కాలిక తరగతి గదులు, విద్యార్థినులకు హాస్టల్ గదులను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను కూడా నియమించారు. కాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభంకానున్నాయి.
సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది..
ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఎంసెట్‌లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి మొదటి సంవత్సరంలో 60 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది. కళాశాల ఏర్పాటుతో జిల్లా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది. జిల్లాలోని రైతులకు కూడా పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
– శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్