మంచిర్యాలటౌన్, జూన్ 7: మంచిర్యాల పట్టణ ప్రజలు తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట పైపులైన్లు పగిలిపోవడం, హుటాహుటిన వాటికి మరమ్మతులు చేయడం సర్వ సాధారణమైంది. మరమ్మతులు జరుగుతున్న రోజుల్లో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో పట్టణంలోని 36 వార్డుల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగిన దాఖలాలు కనిపించ లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువసార్లు పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీలకు గురికావడంవంటి అంశాలు ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. అసలే వేసవికాలం, అందులోనూ తాగునీరు, అత్యవసరమైన ప్రక్రియ, ఇంకేముంది, తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్న చందంలా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన రెండు నెలలుగా పట్టణంలోని 36 వార్డుల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగిన దాఖలాలు కనిపించ లేదు. పైపులైన్ల మరమ్మతులు జరుగుతున్నందున ఈ రోజు, రేపు నల్లాలు రావు’ అనే స్టేటస్లు కౌన్సిలర్ల వాట్సప్‌లలో ఈ మధ్య కనిపిస్తున్నాయి. పైపులైన్లు లేని చోట, శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలకోసం నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు రెడ్డికాలనీ, రాంనగర్, ఇస్తాంపుర, గౌతమీనగర్, మార్కెట్ ఏరియా, హమాలీవాడ ప్రాంతాల్లో బోర్లలో నీరు ఎండిపోవడం, భూగర్భ జలా లు అడుగంటిపోవడంలాంటి అంశాలతో నీటికోసం జనం తండ్లాడుతున్నారు. తరచూ పైపులైన్లు పగిలిపోవడం, మరమ్మతులు చేయడంవంటివి విని విసుగెత్తి పోతున్నారు. దీనికి తోడు కరెంటు కోతల సమస్యను అధికారులు సాకుగా చెబుతున్నారు. గాలివానలకు కరెంటు పోయినప్పుడు నీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు.
పైపులైన్ల లీకేజీ అనేది నిరంతర ప్రక్రియ. పాతపైపులు కావడం, అవికూడా సిమెంటు (ఆర్సీసీ) పైపులు కావడం వల్ల వాటిపైనుంచి పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు పగులుతున్నా యి. లీకేజీలు, మరమ్మతుల సమస్య ముం దునుంచి ఉంది. పైపులైన్లలో నీటిప్రవాహం ఒత్తిడి కారణంగా కూడా అవి పగులుతుంటాయి. వాటికి మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి సరిపడా మెటీరియల్‌ను కొనుగోలు చేసి దగ్గర పెట్టుకుంటాం. పనులు చేసేది మున్సిపాలిటీ వారే కనుక త్వరగా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ముల్కల పంప్‌హౌస్ వద్ద కరెంటు లేని కారణంగా నీటిని ఇవ్వలేక పోయాం. తాగునీటి ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.