హాజీపూర్, ఫిబ్రవరి 22: చిన్నతనంలో మా అమ్మతో కలిసి కలెక్టర్‌ను కలుద్దామని వెళ్తే మమ్మల్ని నెట్టేశారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని గుడిపేటలో ఉన్న 13వ ప్రత్యేక తెంగాణ పోలీస్ బెటాలియన్‌లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఘటనతోనే.. ఇల్లు అమ్మి మా అమ్మ కలెక్టర్‌ను చేస్తానంది.
ఎనిమిదేండ్లు వేచి చూసినా కాలేకపోయాను. రెండు సార్లు ప్రయత్నించినా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో క్వాలి ఫై అయి, ఇంటర్వ్యూలో వెనుదిరిగా. అమ్మా నాన్న ఇల్లు అమ్మి చదివిస్తే డీఎస్పీ అయ్యాను’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కష్టపడి చదివితే ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నారు. సమాజ సేవ చేయడానికి మీకు పోలీస్ ఉద్యోగం వచ్చిందని, ఈ తొమ్మిది నెలల శిక్షణ సమయంలో ఎలాంటి రిమార్క్ లేకుండా క్రమ శిక్షణతో మెలగాలని సూచించారు.
బెటాలియన్ కమాడెంట్ జమీల్ బాషా మాట్లాడుతూ శిక్షణలో భాగంగా 331 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ రావాల్సి ఉండగా, 241 మంది వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు మిగతా వారు చేరేందుకు అవకాశం ఉందన్నారు. శిక్షణ కానిస్టేబుళ్లకు సీపీ చేతుల మీదుగా మెటీరియల్స్ అందజేశారు. సీపీని బెటాలియన్ కమాడెంట్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. మంచిర్యాల ఏసీపీని బెటాలియన్ అస్టిటెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్ఐ సురేశ్ వర్మ, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.