శ్రీరాంపూర్, మార్చి 23 : సింగరేణిలోని భూగర్భ గనుల్లో కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను వినియోగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలనే తపనతో కాలం చెల్లిన వాటిని వాడుతుండగా, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కార్మికులు, మైనింగ్ స్టాఫ్‌పై అధికారులు నిందవేసి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తున్నది.
లెక్కకు మించి యంత్రాలతో..
సింగరేణిలో 20 భూగర్భ గనులుంటే.. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 7 గనులున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పిత్తి అధికంగా చేయాలనే లక్ష్యంతో నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మంచి ఎస్డీఎల్ యంత్రాలను నడిపిస్తున్నారు. అధికారికంగా కేటాయించిన ఎస్డీఎల్ యంత్రాలతో మాత్రమే ఉత్పత్తి తీస్తే లక్ష్యాలను చేరుకోలేమని అధికారులే పేర్కొనడం గమనార్హం.
ఆర్కే-5లో కూరుకుపోయిన ఎస్డీఎల్
స్థానిక ఆర్కే-5 గనిలో శనివారం మొదటి బదిలీలో పై కప్పు కూలి ఎస్డీఎల్ (కాలం చెల్లిన) యంత్రం పూర్తిగా తీయలేని స్థితిలో కూరుకుపోయింది. గనిలో 3వ సీమ్, 16వ లెవల్ ఉత్పత్తి పని స్థలంలో ఎస్డీఎల్ యాక్టింగ్ కార్మికుడు రమేశ్ ఉత్పత్తి పనులు కొనసాగిస్తున్నాడు. బొగ్గు రవాణాకు సరైన టబ్బులు లేక పోవడంతో ఎస్డీఎల్ యంత్రాన్ని ఆపి వేశాడు. గని పై కప్పు శబ్ధాన్ని గమనించి వెంటనే కొద్ది దూరంలోకి వెళ్లి వేచి చూస్తుండగా.. ఒక్క సారిగా పై కప్పు కూలిపోయింది.
కార్మికుడు తేరుకొని చూసే సరికి ఎస్డీఎల్ యంత్రం కనిపించకుండా బొగ్గు పెల్లల కింద కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కార్మికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎస్డీఎల్ యంత్రాన్ని బయటకు తీయలేని విధంగా ఉందని, అక్కడ ఉత్పత్తి పనులు కూడా చివరి దశకు వచ్చినట్లు మేనేజర్ సుధీర్‌కుమార్ జా పేర్కొన్నారు.
కాగా, అధికారులు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలనే తపనతో.. యాజమాన్యం మెప్పుకోసం కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను వినియోగిస్తున్నారని, ఈ విధానం మార్చుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఇక ఆర్కే-5గనిలో జరిగిన ప్రమాదంపై మైనింగ్ ఇన్స్పెక్టర్లు (డీజీఎంఎస్), అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.