మంచిర్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారులు సానుకూల దృక్పథంలో పరిష్కరించాలని రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు కోరారు. మిల్లుల కెపాసిటీకి మించి బియ్యం ఇచ్చిన సర్కార్, ఇప్పుడు సీఎంఆర్ పెండింగ్ పెట్టలేదని కేసులు పెట్టడం సరికాదన్నారు. సీఎంఆర్ పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాకపోతే కొద్దిగా సమయం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తమ కష్టాలను పరిగణలోకి తీసుకోకుండా, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేసులు పెడుతూ పోతే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 100 కిలోల వడ్లు ఇస్తే 67 కిలోలు మిల్లర్ తిరిగి ఇవ్వాల్సి ఉందని కానీ 67 కిలోలు రావడం లేదని తెలిపారు.
ఈ విషయంపై బహిరంగ పరీక్షలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఇచ్చే వడ్లలో తేమ శాతం 17 ఉండాలి కానీ అంతకు మించి ఉంటుందన్నారు.ఇవన్నీ అధికారులకు తెలిసి కూడా తమ మెడపై కత్తి పెట్టడం ఎంత వరకు న్యాయమో ఆలోచించాలన్నారు. ఇన్ని రోజులు జిల్లాలో రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి ఉండేదని, కానీ ఇప్పుడు రా రైస్ మిల్లర్లకు సంబంధించి ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఈ అసోసియేషన్ ఉందని, మంచిర్యాలలో ఈ రోజు ఏర్పాటైందని తెలిపారు. రా రైస్ మిల్ వెల్ఫేర్ అసొసియేషన్ ప్రెసిడెంట్ పాడి గణపతిరెడ్డి ఆదేశాల మేరకు.. మంచిర్యాల నూతన కార్యవర్గం ఈ రోజు ఎన్నికైందన్నారు. అధ్యక్షుడిగా తనతో పాటు జనరల్ సెక్రటరీగా బత్తుల శ్రీనివాస్, ట్రెజరరిగా మావాడి సంతోష్, ఉపాధ్యక్షుడిగా జాడి రమేశ్, జాయింట్ సెక్రటరీగా కాళేశ్వరం సాగర్ తదితరులు ఎన్నికయ్యారన్నారు. సమస్యల పరిష్కారానికి రా రైస్ మిల్లర్లు అంతా ఏకతాటిపై ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.