వాంకిడి : మెదక్-నిజామాబాద్, ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్( Polling ) ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే (Collector Venkatesh Dhotre) తెలిపారు. గురువారం వాంకిడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాస్‌రావు ( SP Srinivas Rao ) తో కలిసి సందర్శించి పోలింగ్ సరళీని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, విద్యుత్, వెలుతురు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి వరసలో నిలబడి ఉన్న వారికి చిట్టీలు అందించి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రతా చర్యల మధ్య కరీంనగర్‌లోని స్ట్రాంగ్ రూముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణ కోసం 19 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.