రూ.38 కోట్లతో పోలీసు కార్యాలయ భవనం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తగ్గిన నేరాలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 7 : నూతన జిల్లాల ఏర్పాటుతోనే నిర్మల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని బత్తీస్గఢ్ ప్రాంతంలో రూ.38 కోట్లతో చేపడుతున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తీస్గఢ్ ప్రాంతంలో 15 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తెలంగాణ పోలీస్ హౌజింగ్‌బోర్డు కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.38 కోట్లతో జిల్లా పోలీసు, ఎస్పీ క్యాంపు, సాయుధ దళ కార్యాలయం అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నామని తెలిపారు. గడువు లోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో నేరాల రేటు తగ్గిందన్నారు. పోలీసులకు అధునాతన వాహనాలతో పాటు స్టేషనరీ ఖర్చులకు ప్రభుత్వం నిధులు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు ఎస్పీలు రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు ఈఈ శ్రీనివాస్, డీఈఈ ఆశీర్వాదం, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ వల్లకొండ విజయ్ గౌడ్, కౌన్సిలర్లు, సీఐ శ్రీనివాస్, రాంనర్సింహా రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
త్వరలో నిర్మల్‌కు మెడికల్ కళాశాల
నిర్మల్ జిల్లాకు త్వరలో మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మదీనా కాలనీలో రూ.31లక్షలతో చేపడుతున్న ఏరియా వెటర్నరీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణంతో వైద్యులకు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కలీం హైమద్ పాల్గొన్నారు.