భైంసా, జనవరి, 2 : భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ కేసును 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం భైంసాలోని ఏఎస్పీ క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘరతన్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని పధకం చేశారు.
ఇందులో భాగంగా నాగదేవత ఆలయం తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో భైంసా పట్టణంలోకి ప్రవేశించే మార్గంలో సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గమనించారు. ఇందులో ఒకరి షర్ట్‌కు పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించారు. అనుమానితుడిగా భావించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కొత్త సంవత్సరం వేడుకలకు చోరీ చేసినట్లు తేలడంతో వారిద్దరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపినాథ్, పోలీసు సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.