జైనథ్(బేల)/నిర్మల్ అర్బన్/భైంసా, జనవరి 2 : ఆదిలాబాద్ జిల్లా బేల మండల శాఖ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు మంగళవారం అంబేద్కర్ కూడలి వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు షేక్ జబి మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రోడ్డు ప్రమాదాలపై కొత్త చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్లను బాధ్యులను చేసి.. వారి వద్ద నుంచే నష్టపరిహారం వసూలు చేసేలా నూతన చట్టం రూపొందించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఇలాంటి చట్టాలను అమిత్ షా వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాస్తారోకోలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు.
బంకుల వద్ద బారులు
హిట్ అండ్ రన్ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్ల ధర్నాతో బంకుల వద్ద ఇంధన సరఫరా నిలిచింది. దీంతో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులుదీరుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని వాహనదారులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు
పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు.