మంచిర్యాల, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులపై జనాల్లో తీవ్రఅసంతృప్తి కనిపిస్తున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలో ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసింది ఏం లేదు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నా.. వీటిలో సగానికిపైగా ఉద్యోగాలు కేసీఆర్ సర్కారు హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించినవే ఉన్నాయి. గెలిచిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఆ హామీని నిలబెట్టుకోలేకపోవడంతో గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. మిగిలిన వర్గాలైన రైతులు, మహిళలు, వృద్ధులను సంతృప్తి పరచడంలో ఘోరంగా విఫలమైంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా.. జిల్లాకు ఒరగబెట్టింది ఏం లేదు. గతంలోనూ ఇక్కడ ఎంపీ బీజేపీ నుంచే ఉన్నారు. నవోదయ పాఠశాల మంజూరు, సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వేలైన్ అంశంలో పురోగతి లేదు. ఇలా రెండు జాతీయ పార్టీలపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తున్నది.
జాతీయ పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్, బీజేపీల్లోని క్షేత్రస్థాయి కీలక నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం, పైగా మంత్రులకు ఇన్చార్జి ఇవ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తున్నది. చాలా చోట్ల మంత్రులు ప్రచారం చేయడానికి వచ్చినప్పుడే ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు తప్ప అసలు ఎమ్మెల్సీ ఎన్నికలను వాళ్లు సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నరేందర్‌రెడ్డికి కేవలం ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లోనే గుర్తింపు ఉందని, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయన ఫోర్స్ సరిపోవడం లేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మొన్నటికి మొన్న నిర్మల్ జిల్లా ముథోల్ మీటింగ్‌లో ప్రచార కార్యక్రమంలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. ఇక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మెదక్ జిల్లావాసి కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోకల్ ఫీలింగ్ తీసుకురాలేకపోతున్నారు. నిజామాబాద్, కరీంనగర్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీలోని సీనియర్లు ఆయనకు సహకరించడం లేదని తెలిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని వదిలేసి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం సదరు నాయకులు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. జాతీయ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులంతా డబ్బులున్న వారు కావడం కూడా పైసలున్నోళ్లకే టికెట్లు ఇచ్చాయనే చర్చ జనంలో నడుస్తున్నది. ఇది కూడా ఆ పార్టీల అభ్యర్థులకు మైనస్‌గా మారనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ రావడానికి ముందు ఉన్నంత వేడి ఇప్పుడు కనిపించడం లేదు. జాతీయ పార్టీ అభ్యర్థుల విషయంలో పునరాలోచన చేసి ఉంటే బాగుండేదన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తున్నది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసేవారై ఉండాలి. ఈ ఎన్నికల కోసం ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు కొన్ని జిల్లాలకే పరిమితం అవుతున్నారు. ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప మిగిలి ప్రాంతాల్లో వారి ప్రభావం తక్కువగా కనిపిస్తున్నది. దీంతో జిల్లాకు ఓ అభ్యర్థి పేరు వినిస్తున్నది. ఈ నేపథ్యంలో గెలుపు, ఓటములను అంచనా వేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లు ఎమ్మెల్సీ ఎన్నికలకు సీరియస్‌గా తీసుకోకపోవడం అన్నది ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా జాతీయ పార్టీల నాయకులు ఆ పార్టీ అభ్యర్థుల కోసం నడుం బిగిస్తే తప్ప విజయం సాధించడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఆయా పార్టీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘాల హవా నడుస్తున్నది. ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న ట్రస్మా నాయకులు ఎవరికి వారు తమకు కావాల్సిన వారికి మద్దతు ప్రకటించి ప్రచారంలో ముగిని తేలుతున్నారు. ఇక ప్రత్యేకంగా కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయ లీడర్ల పెత్తనం ఎక్కువైపోయింది. ఉత్తర తెలంగాణలో దాదాపు 50కి పైగా విద్యాసంస్థలున్న విద్యా వ్యాపారిగా ఆయన్ని జనాలు అభివర్ణిస్తున్నారు. ఇన్ని విద్యా సంస్థలు ఉండి ఏనాడు జనాల కోసం ఏం చేయని ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచేందుకు ప్రజాసేవ నినాదం ఎత్తుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిచేందుకు ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘాల లీడర్లు కొందరు కత్తులు నూరుతున్నట్లు తెలుస్తున్నది. ఎలాగైనా సార్‌తో డబ్బులు ఖర్చు పెట్టించి, ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా ఆ కొందరు ఉపాధ్యాయ నాయకులు కంకణం కట్టుకున్నారనే ప్రచారం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక బీజేపీ టీచర్ ఎమ్మె ల్సీ అభ్యర్థి విషయంలోనూ కొందరు ఉపాధ్యాయ సంఘా ల నాయకులు ఈ వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. ఇది కూడా ఈ అభ్యర్థులకు కష్టాలు తీసుకురానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.