నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని బాబేఝరి ( Babejhari ) పంచాయతీ కొత్త భవనం పశువుల కొట్టంగా ( Cattle Shed ) మారింది. పంచాయతీలకు భవనాలు ( Panchayat Buildings ) లేకపోవడంతో పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది అవస్థలు పడుతుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భవనం లేని పంచాయతీలకు కొత్త భవనాలను మంజూరు చేసింది. నిధులు కూడా కేటాయించింది. నిర్మాణ పనులు చేపట్టి మధ్యలోనే భవనాలను వదిలేయడంతో వినియోగంలోకి లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
బాబేఝరి పంచాయతీకి కొత్త భవనానికి .రూ20 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో కొత్త భవనం నిర్మించారు. నిధులు మంజూరు కావడం లేదంటూ పనులు మధ్యలోనే వదిలేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. దీంతో పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భవనంలో కొందరు చొప్ప పెట్టి, పశువులను కట్టేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.