కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఆయిల్పాంల విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తున్నది. శాశనసభ ఎన్నికల తర్వాత అధికారులు ఆ వైపు దృష్టి సారించకపోవడంతో తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికే 1048 ఎకరాల్లో తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరలేదు. ప్రస్తుతం 23 మంది రైతులు 129 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తుండగా, ఇక అక్కడితోనే బ్రేక్ పడేలా ఉంది. అధికారులు తోటలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతాంగం నిరుత్సాహానికి గురవుతున్నది.
రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు కేసీఆర్ స ర్కారు జిల్లాలో ఆయిల్‌పాం తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. రైతులను నష్టాలు లేని సాగువైపు మళ్లించేందు కు ఆయిల్ పాంలను పెద్ద మొత్తంలో విస్తరించేందుకు చర్య లు తీసుకుంది. మ్యాట్రిక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడంతోపాటు మొక్కల సరఫరాలో రైతులకు సబ్సిడీని అందించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులకు మొక్కలను సరఫరా చేసేందుకు మంచిర్యాల జిల్లాలోని భీమారంలో ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేశారు. ఒక్కో మొక్క ఖరీదు రూ. 213 ఉండగా, రూ. 193 సబ్సిడీ అందించారు.
అంతేకాకుండా ఆసక్తి ఉన్న రైతులకు రూ. లక్ష విలువగల డ్రిప్‌లను అందజేశారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో ఇవ్వగా, మిగతా రైతులకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్‌లను అందజేసి ప్రోత్సహించారు. దీంతో రైతులు ఆయిల్‌పాం సాగుకు ముందుకు వచ్చారు. రైతులు మొక్కలు నాటిన నాలుగో యేట నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. ఏటా దిగుబడి పెరుగుతూ వస్తుంది. దాదాపు ఏళ్ల పాటు రైతులకు ఆదాయం వస్తూనే ఉంటుంది. రైతులకు ఆర్థికంగా ఇంతలా ఉపయోగపడే ప థకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆయిల్‌పాం తోటల ఏర్పాటుపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మార్కెట్లో ఆయిల్ పాంకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చేపట్టిన ప్రాథమిక సర్వేల ప్రకారం జిల్లాలో సుమారు 3 వేల ఎకరాలు ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా జిల్లాలో 1048 ఎకరాల్లో తోటలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విడుతల వారీగా ఆయిల్ పాం తోటలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇప్పటికే 129 ఎకరాల్లో విస్తరించారు. మార్చిలోగా టార్గెట్ పూర్తిచేసేందుకు రైతులకు అవగాహన కల్పించి భూములను సిద్ధం చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఆయిల్‌పాం సాగుకు బ్రేక్ పడినట్లు అయ్యింది.