నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశుసంరక్షణకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే దవాఖానల పెంపు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాతన సాంకేతికతతో ఉన్న యంత్రాలను ఏర్పాటు చేస్తున్నది. రోగులకు మరింత సేవలందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.22 లక్షలతో నిర్మల్‌లోని మాతాశిశు సంరక్షణ దవాఖానలో టిఫా స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. గర్భిణులు ఈ యంత్రంతో బయట పరీక్షలు చేయిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతాయి. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన స్కానింగ్ యంత్రం ద్వారా ఉచితంగానే సేవలు పొందుతున్నారు. నిర్మల్ ప్రసూతి దవాఖానలో జనవరి నుంచి ఇప్పటివరకు సాధారణ స్కానింగ్ పరీక్షలు 12,920 చేశారు. దవాఖానలో కొత్తగా ప్రారంభించిన టిఫా స్కానింగ్ యంత్రం ద్వారా 130 మందికి పరీక్షలు చేశారు.
టిఫా అంటే..
టిఫా అనగా టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీట ల్ అనోమలిస్. ఇందులో లెవెల్-1, లెవెల్-2 అనోమలిస్ స్కాన్ అని అంటారు. ఈ స్కానింగ్ యంత్రం ద్వారా గర్భంలోని పిండానికి ఏర్పడనున్న అవయవాలను కూలంకషంగా గుర్తించవచ్చు. ప్రతి గర్భిణి ఐదు నెలల వ్యవధిలో పరీక్ష చేసుకోవాలి. 18 నుంచి 24 వారాల గర్భవతులు తప్పక ఈ పరీక్షలు చేసుకోవాలి. ఒకవేళ పరీక్షలు చేయించుకోకపోతే 28 వారాల తర్వాత చేయించుకోవాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్య పరిస్థితి, అవయవాలు ఏర్పడుతున్న తీరు స్పష్టంగా అర్థమవుతుంది. పీసీపీఎన్డీటీ అనుమతి పొందిన, అత్యాధునిక స్కానింగ్ మిషిన్ నైపుణ్యం ఉన్న రేడియాలజిస్ట్ ఉన్న చోట ఈ పరీక్ష చేయించుకోవాలి. టిఫా స్కానింగ్ చేసుకోవడానికి స్త్రీ వైద్య నిపుణుల ద్వారా అభ్యర్థన పత్రం పొంది ఉండాలి.
పలు ఉపయోగాలు..
ఈ స్కానింగ్ యంత్రం ద్వారా పిండం పెరుగుదల, గుండె చప్పుడు, ఎన్ని పిండాలు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. మాయ, ఉమ్మనీరు స్థితిని తెలుసుకోవచ్చు. ప్రసవ తేదీని తెలుసుకోవచ్చు. దీనికితోడు గర్భసంచి ద్వారం ఎలా ఉందో సైతం తెలుసుకునే వీలుంది. ఒక్కో స్కానింగ్‌కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గర్భిణులు ఉచిత పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి. అత్యంత అధునాతనమైన టిఫా స్కానింగ్ యంత్రం ద్వారా గర్భిణులకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. గర్భంలోని పిండం ఎదుగుదల, తల పెరుగుదల, గడ్డలు, తదితర అవయవ లోపాలు స్కానింగ్ యంత్రం ద్వారా తెలుసుకునే ఆస్కారం ఉంది. పరీక్షల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా వైద్యులు చికిత్స చేసేందుకు ఉపయోగం కలుగుతుంది. నిర్మల్ ఎంసీహెచ్‌లో నిత్యం 70 నుంచి 80 మంది గర్భిణులకు పరీక్షలు చేస్తున్నాం.
– డాక్టర్ అజయ్‌రెడ్డి, రేడియాలజిస్ట్, ఎంసీహెచ్, నిర్మల్